రాబోయే ఎన్నికలను అధికార వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పార్టీ అంతర్గత మీటింగ్స్ లో పదే పదే రాబోయే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలవాలి,చివరకు చంద్రబాబు నాయుడు కుప్పం కూడా గెలివాలి అంటున్నారు. దానికి తగ్గట్లు గానే జగన్ గారు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పెట్టీ ఎమ్మెల్యే లను జనాల్లో ఉండాలని హుకుం జారీ చేశారు. కానీ ఆయన అనుకున్నట్లు అది విజయవంతం అవ్వలేదు.
వైసీపీ అధినేత , సీఎం జగన్ ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రంగా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులందరితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. 19వ తేదీన తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో శాసన సభ్యులు అందరూ అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు.ఇక నియోజకవర్గ ఇంచార్జ్ లకు కూడ సమాచారం అందింది. 175 నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేల, వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్త లతో జగన్ సమావేశం అవుతున్నారు.
ప్రస్తుతం వైసీపీకి సోషపల్ మీడియాతో పాటు ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ కు చెందిన రిషి రాజ్ పని చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా సర్వే టీముల్ని పంపి సర్వేలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నారు. ఈ నివేదికలు దాదాపుగా అరవై, డెభ్బై మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వారిని ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపర్చుకోవాలని జగన్ ఆదేశిస్తున్నారు. గ్రాఫ్ పెరగకపోతే ఎంత సీనియర్లనైనా సరే పక్కన పెడతానని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఎప్పటికప్పుడు జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎవరెవరు సీరియస్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు ఎవరు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లాంటి వివరాలతో ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో పని తీరు గురించి కూడా జగన్ కొంత మందిపై అసంతృప్తితో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉంది.