ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు తో పోల్చుకుని తమ ప్రభుత్వ పనితీరు ఎంతో బాగా పని చేస్తుందని వెల్లడించడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎప్పుడూ వెనకాడరు. తమ ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ఎప్పుడూ విమర్శించకపోయినా సరే హరీష్ రావు మాత్రం విమర్శలలో ముందుంటారు. తాజాగా ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ఏపీతో పోలికలు తెచ్చారు. ఈ సారి ఉద్యోగుల సంక్షేమం ఫిట్మెంట్ టీచర్ల సమస్యల గురించి కూడా మాట్లాడారు.
హరీష్ రావు ఎప్పుడు ఏపీ ప్రభుత్వం మీద సెటైర్లు వేయాలన్నా ముందుగా కరెంట్ మీటర్ల అంశాన్ని ముందుకు తెస్తారు. ఈ సారి కూడా అదే అంశాన్ని హైలెట్ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతుల మెడకు ఉరితాడు తగిలించడమేనని అలా మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఏపీ సర్కార్ అప్పు తెచ్చుకుందన్నారు. తామూ ఒప్పుకుంటే ఏటా రూ. ఆరు వేల కోట్లు వస్తాయని కానీ రైతుల గురించి ఆలోచించే తాము ఆ సొమ్మును వదులుకున్నాం అని అన్నారు. ఓ వైపు మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దానికి భిన్నంగా హరీష్ రావు చెబుతున్నారు. చాలా కాలంగా ఆయన ఇదే వాదన వినిపిస్తున్నారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు తాడిపత్రికి చెందిన ఓ రైతును కరెంట్ పరిస్థితి గురించి వాకబు చేశానని కానీ మూడు గంటలు అదీ కూడా వచ్చీ పోతూంటుందని రైతు చెప్పారని హరీష్ రావు తెలిపారు. ఏపీలో కరెంట్ సమస్యలు ఎక్కువని ఇక రోడ్ల గురించి చెప్పాల్సిన పని లేదన్నారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు సమస్యలపై పోరాటం చేస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారని కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మంచి ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవంగా చూస్తోంది అని అన్నారు. ముఖ్యంగా టీచర్ల విషయాన్ని హరీష్ రావు నొక్కి చెప్పారు. టీచర్లను ఏపీ ప్రభుత్వం ఎలా చూస్తుందో కనిపిస్తోందని కానీ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తగ్గ గౌరవం ఇస్తోందన్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో టీచర్లు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై అనేక రకాల కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో పలు రకాల యాప్‌లను ప్రవేశపెట్టి ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ అంశాలనే హరీష్ ప్రస్తావించి తెలంగాణ టీచర్లకు తాము ఎంత మంచి చేస్తున్నామో వివరించే ప్రయత్నం చేశారు.