రాష్ట్ర ప్రభుత్వంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. జులై 30న ఒంగోలు ఏబీఎం గ్రౌండ్స్లో బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్లీనరీకి కూడా ఇటువంటి నిబంధనలు పెట్టారా?.. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యేక చట్టం ఏమన్నా ఉందా ? అని శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ దురాగతాలపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు.. ఒంగోలు సభలో గళం విప్పుతారని శ్రవణ్కుమార్ తెలిపారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అంబేడ్కర్ 131వ జయంతి రోజున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ ‘జై భీమ్ భారత్’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసిన నిందితులను శిక్షించలేని దుర్మార్గపు పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దళితుల సమస్యలు పరిష్కరించని, దాడులపై స్పందించని వైసీపీలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓడించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.