ఇండియా 190/6 వెస్ట్ ఇండీస్ 122/8
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జోరు టీ20ల్లోనూ కొనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో శుక్రవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణించిన భారత్ జట్టు 68 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా ఇక రెండో టీ20 మ్యాచ్ సెయింట్ కిట్స్ వేదికగా సోమవారం రాత్రి 8 గంటలకి జరగనుంది. గత బుధవారం వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌నీ 3-0తో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (64: 44 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (41 నాటౌట్: 19 బంతుల్లో) చెలరేగడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ప్రయోగాత్మక ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (24)తో పాటు శ్రేయాస్ అయ్యర్ (0), రిషబ్ పంత్ (14), హార్దిక్ పాండ్య (1), రవీంద్ర జడేజా (16) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 191 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభం నుంచి వెస్టిండీస్ తడబడుతూ వచ్చింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (15), బ్రూక్స్ (20) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైపోగా జేసన్ హోల్డర్ (0), నికోలస్ పూరన్ (18), రొవ్‌మెన్ పొవెల్ (14), సిమ్రాన్ హెట్‌మెయర్ (14), అకేల హొసెన్ (11), ఓడెన్ స్మిత్ (0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కానీ.. ఆఖర్లో భారత బౌలర్లపై ఎదురుదాడి చేసిన కీమోపాల్ (19 నాటౌట్: 22 బంతుల్లో).. విండీస్ ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డాడు. అతనికి అల్జారీ జోసెఫ్ (5 నాటౌట్: 11 బంతుల్లో) సపోర్ట్ అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, అశ్విన్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్, జడేజాకి చెరొక వికెట్ దక్కింది. ఓవరాల్‌గా విండీస్ టీమ్ ఛేదనలో 122/8కే పరిమితమైంది.