ముందుజాగ్రత్తతో చేపట్టిన ఈ రక్షణ చర్యలను మంగళవారం సీడబ్ల్యూసీ (డిజైన్స్ విభాగం) సీఈ డీసీ భట్ ప్రశంసించారు. నిజానికి.. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్‌ను 28.5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికే సీడబ్ల్యూసీ గతంలో డిజైన్ చేసింది. ఆ మేరకే పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. కానీ, గోదావరి బేసిన్‌లో ఈనెల 13 నుంచి కురిసిన భారీ వర్షాలవల్ల పోలవరం వద్దకు 28.50 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. కానీ, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాఫర్ డ్యామ్‌ను రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈనెల 14న జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన 40.5 మీటర్ల నుంచి 43 మీటర్ల వరకూ రివిట్‌మెంట్‌పైన కోర్ (నల్లరేగడి మట్టి) వేసి, దానిపై ఇసుక బస్తాలను వేశారు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటర్ ఎత్తుతో మట్టి, రాళ్లువేసి కాఫర్ డ్యామ్ ఎత్తును 43 నుంచి 44 మీటర్లకు పాక్షికంగా పెంచే పనులను 48గంటల రికార్డు సమయంలోనే అధికారులు పూర్తిచేశారు.
సీడబ్ల్యూసీ అనుమతి కోరిన అధికారులు
సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. ఇలా గరిష్టంగా వరద వచ్చినా ఎదుర్కొనేలా కాఫర్ డ్యామ్‌ను పటిష్టంచేసే పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో మరింత పటిష్టపర్చడం.. పూర్తిస్థాయిలో 44 మీటర్ల ఎత్తుకు పెంచే పనులు చేపట్టడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ అనుమతిని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కోరారు. దీనిపై సీడబ్ల్యూసీ సీఈ (డిజైన్స్) డీసీ భట్ అధ్యక్షతన మంగళవారం కేంద్రం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈ (డిజైన్స్) రాజేష్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీడబ్ల్యూసీ, పీపీఏ అభినందించాయి.
అనుమతుల ప్రకారమే పోలవరం – మంత్రి బొత్స
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం.
పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు – మంత్రి అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.