ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన వాల్ పోస్టర్స్ -స్టిక్కర్లు- ఫోమ్ బోర్డులను
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మద్యం దుష్ఫలితాల పై ప్రజలను జాగృతలను చేయడం ద్వారానే మద్య రహిత సమాజం సాధ్యమౌతుందన్నారు.ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం ద్వారా పొగత్రాగడం తగ్గిందని అదే విధంగా మత్తు పానీయాల పై విస్తృతంగా ప్రచారం జరగాలన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీ పోస్టర్లను ఆర్టీసీ బస్సులపై మరియు ఆర్టీసీ ప్రాంగణాలలో ఉంచడం ద్వారా కోట్లాది మంది ప్రజల చెంతకు మద్యం దుష్పలితాల ప్రచారం చేరుతుందన్నారు.ఈ మహాత్తర బాధ్యతను తీసుకున్న ఆర్టిసి ఎండి సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ను ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు.
విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి ఈ విద్యాసంవత్సరంలో గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, ఆర్ట్ పోటీలను నిర్వహిస్తామని తెలియజేశారు. అన్ని డిగ్రీ,ఇంజనీరింగ్ కళాశాలలో మద్యం దుష్ఫలితాల పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్రంలోని అన్ని టోల్ గేట్స్ దగ్గర బ్రీత్ ఎనలైజర్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.బహిరంగ మద్య సేవనం నిరోధించడానికి పోలీసు యంత్రాంగం సమాయాత్తం అవుతుందన్నారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన నాటి నుండి నాటుసారా,గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పానీయాల పై వేలాది కేసులు పెట్టి వేలాది మందిని అరెస్టు చేశారని,వేలాది వాహనాలను సీజ్ చేశారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో 15 చోట్ల వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందని వాటిని బలోపేతం చేసి ఉచితంగా చికిత్సను అందించడానికి కృషి జరుగుతుందన్నారు.ఆర్టీసీ ఎండి సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ ఆర్టీసీ సిబ్బందికి నిరంతరం బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహిస్తున్నామని బస్సు ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీ రూపొందించిన పోస్టర్ లను,స్టిక్కర్లను,ఫోమ్ బోర్డ్స్ లను బస్టాండ్ ప్రాంగణాల్లో ఉంచుతామని,ఇతర జిల్లాలకు వెళ్లే రాష్ట్ర వ్యాప్త బస్సులపై అంటించి ప్రజలను జాగృతలను చేస్తామన్నారు.మద్యం సేవించి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాలను నిరోధించడానికి అందరం ఐక్యంగా కృషి చేయాలని కోరారు.