ఆదివాసీ మహిళ ఐన ద్రౌపది ముర్ము అద్భుతం సృష్టించింది. అడవిలో పుట్టి అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపొందారు. భారత ప్రథమ పౌరురాలిగా రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించనున్నారు. గతంలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించగా ఇప్పుడు ముర్ము తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. 2007 నుంచి 2012 వరు ప్రతిభాపాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతిగా సేవలందించగా అత్యున్నత పదవి అధిరోహించనున్న ద్రౌపది ముర్ము 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.
దేశ అత్యున్నత పదవి
నిన్న మొన్నటి వరకు కనీసం కరెంటు కూడా లేని కుగ్రామంలో పుట్టిన ద్రౌపది ముర్ము. ఇప్పుడు దేశ అత్యున్నత పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దేశానికి స్వతంత్రం వచ్చిన 11 సంవత్సరాల తరువాత అంటే 1958 జూన్ 20 న ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసి తెగకు చెందినవారు. ఈ తెగ వందల ఏళ్లుగా మన దేశంలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. అంతేకాదు సంతాల్ తెగ వీరులను భారతదేశ మొదటి స్వాతంత్ర పోరాట యోధులుగా కూడా పిలుస్తారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఇప్పుడు దేశ రాష్ట్రపతి అయ్యారు.
టీచర్ గా ప్రస్థానం ప్రారంభం
ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ముర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. టీచర్ గా జీవితం మొదలుపెట్టిన ద్రౌపది ముర్ము. తర్వాత బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. ద్రౌపది ముర్ము 1979లో భువనేశ్వర్ లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటి పారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. తరువాతి కాలంలో తనకున్న ఆసక్తితో ఆమె టీచర్ అయ్యారు. రాయరంగ్ పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పని చేశారు.
కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు
1997లో ద్రౌపది ముర్ము తన పొలిటికల్ కెరీర్ ని మొదలుపెట్టారు. మొదట రాయరంగ్ పూర్ నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్ గా గెలుపొందారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత రాయరంగ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి 2000, 2009 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్యం, రవాణా, మత్స్య, జంతు వనరులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు. అందుకే ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ముర్ము అందుకున్నారు.
గతంలో జార్ఖండ్ గవర్నర్
రెండుసార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ముర్ము వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గంలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఆ తర్వాత ముర్మును జార్ఖండ్ గవర్నర్ గా నామినేట్ చేశారు. దీంతో క్రీయాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2015 మే 18న ఝార్ఖండ్‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్ గా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఐదేళ్ల పదవీ కాలం ముగిశాక కూడా ఆమె అక్కడ గవర్నర్ గా కొనసాగారు.
వివాద రహితురాలు
గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నాక కూడా వివాదరహితురాలిగానే ముర్ము కొనసాగారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా ముందుకు కదిలారు. గతంలో ఆమె బీజేపీ నేతగా ఉన్నా జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నప్పుడు బీజేపీ సర్కారు తెచ్చిన బిల్లుల్లో కొన్నింటిని వెనక్కి పంపారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన చోటానాగ్ పూర్ కౌలుదారీ చట్టం, సంతాల్ పరగణా కౌలు చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించాలని 2017లో అప్పటి రఘువర్ దాస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయితే ఆమోదం కోసం రాజ్ భవన్ కు ఫైలు వెళ్లిన తర్వాత గవర్నర్ గా ఉన్న ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కు పంపారు. దీనివల్ల ఆదివాసీలకు ఏం లాభమని ప్రశ్నించారు. అందుకు రాష్ర్ట ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేకపోయింది. దాంతో ఆ బిల్లు ముందుకు సాగలేదు. దీనిపై విమర్శలు వచ్చినా ముర్ము వెనక్కి తగ్గలేదు. సవరణ బిల్లుపై 200 అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. వాటిపై క్లారిటీ ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వానికి చెప్పారు. ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఈ బిల్లు విషయంలో ఆమె వెనకడుగు వేయలేదు. తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.
ఆదివాసీలకు అండగా
ఆ తర్వాత మరో అంశంలోనూ ఇదే విధంగా జరిగింది. రఘువర్ దాస్ ప్రభుత్వం హయాంలో పాతాళగడి వివాదం చెలరేగింది. అప్పుడు, ద్రౌపది ముర్ము ఆదివాసి గ్రామపెద్దలను, మాంకి, ముండాలను రాజ్ భవన్ కు పిలిపించి, వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 2019 డిసెంబర్‌లో రఘువర్ దాస్ ప్రభుత్వం కూలిపోయి జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నెలలకు హేమంత్ సోరెన్ ప్రభుత్వం ట్రైబల్ కన్సల్టేటివ్ కమిటీ (టీఏసీ ) ఏర్పాటుకు సంబంధించిన సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ సవరణ ప్రకారం టీఏసీ ఏర్పాటులో గవర్నర్ పాత్ర ఉండదు. ద్రౌపది ముర్ము దానిపై సంతకం చేయకుండా ప్రభుత్వానికి తిరిగి పంపారు.
విద్యకు ప్రాధాన్యం
ద్రౌపది ముర్ము గవర్నర్ గా ఉన్నప్పుడు విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేవారు. 2016లో యూనివర్శిటీల కోసం లోక్ అదాలత్ నిర్వహించారు. తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఛాన్స్ లర్ పోర్టల్ ప్రారంభించారు. యూనివర్శిటీలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను దీనికి అనుసంధానించారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో చర్చిస్తూ గిరిజన భాషల అధ్యయనానికి సంబంధించిన సూచనలు చేశారు. యూనివర్శిటీల్లో చాలా కాలంగా మూతపడిన గిరిజన, ప్రాంతీయ భాషల ఉపాధ్యాయుల నియామకం గవర్నర్ చర్యల ఫలితంగా మళ్లీ మొదలైంది.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ద్రౌపది ముర్ము క్లర్క్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఎక్కడ పని చేసినా ఆ పదవికి గౌరవం తీసుకొచ్చారని ఆమె గురించి తెలిసిన వాళ్లు గొప్పగా చెబుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజా ప్రతినిధిగా అన్ని చోట్లా ముర్ము ప్రజల సంక్షమమే లక్ష్యంగా పని చేశారని అంటుంటారు. తర్వాత గవర్నర్ పదవిలో ఉన్నా రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా తన, పర అనే బేధాలు లేకుండా పార్టీలకతీతంగా పదవికి వన్నె తెచ్చారని చెబుతారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవికి ఆమె ఖచ్చితంగా మరింత గౌరవం తీసుకొస్తారని ఆశిస్తున్నారు.