ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఈ యూనివర్శిటీలో చదివిన అనేకమంది ప్రపంచవ్యాప్తంగా మంచి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. యూనివర్శిటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు.
ఉన్నత విద్య యొక్క పరిధి, డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, ఉన్నత విద్యా సంస్ధల ముఖ్యమైన లక్ష్యం ప్రపంచ స్థాయి విద్యను అందించటమే కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉన్నత విద్యలో ప్రపంచ ప్రమాణాలను ప్రోత్సహించడం ద్వారా మేధో సంపన్నులను తీర్చిదిద్దటం సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వేదికగా శుక్రవారం జరిగిన డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం 24, 25వ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో రాజ్‌భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ హరిచందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ బిశ్వభూషణ్ ప్రసంగిస్తూ విద్య దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, దేశానికి వెన్నెముకగా నిలిచి మానవ శక్తిని పెంపొందిస్తుందన్నారు. విద్య దేశాభివృద్దితో పాటు నాగరికత పురోగతిలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.
పౌరులు చైతన్యవంతంగా, ఔత్సాహికంగా, బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని గవర్నర్ అన్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుందన్నారు. విద్యార్థులు సమాజానికి సేవ చేయాలని, తాము గడించిన నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని సమాజానికి తిరిగి అందించాలని, నిరు పేదలకు సమగ్ర వైద్యం పట్ల బాద్యతగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్ధులను వారికి మార్గదర్శకత్వం వహించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ఎంచుకున్న మార్గంలో మంచి విజయాలు నమోదు చేయాలన్నారు.