ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరగా ముందు జాగ్రత్తగా అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీటి ప్రవాహంతో కొన్ని మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వరద నీరు రహదారులు, కాజ్‌వేలపై పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం శివాయిలంక, చినకందాల పాలెం, వాడ్రేవుపల్లి, నాగుల్లంక గ్రామాల్లోకి వరదనీరు చేరాయి. అయినవిల్లి లంక కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోవడంతో నాలుగు లంకగ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ కర్ణాటకలోని పల్నాడు ప్రాంతమైన సీమొగ్గ, ఆరావళి పర్వతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం ఉప్పొంగుతోంది. వరదప్రవాహం అధికం కావడంతో అధికారులు జలాశయం 20 గేట్లు ఎత్తివేసి 39,243 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు కోరుతున్నారు.
కాగా పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి కొత్తపేటలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఇంటి యాజమాని శిరాసాల ఏడుకొండలు ఉదయాన్నే టీ తాగటానికి బయటకు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 34.3 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తమైన అధికారులు 48 గేట్లను ఎత్తి దిగువకు 12.84 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. పోలీస్ చెక్ పోస్టును వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై వరద నీటిమట్టం 14 అడుగుల చేరడంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు.