ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో నాడు- నేడు’ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన సొంతూరు నారావారిపల్లెలోనూ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని తాము మాత్రం అక్కడి స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని,14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదన్నారు. దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా చేస్తున్న కుప్పంలోనూ పాఠశాలలు దీనావస్థలో ఉండేవని వివరించారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేశారని విమర్శలు చేశారు.
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ అన్నారు.మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవని, డ్రాప్ ఔట్ రేట్ పెరుగుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అయితే, తాము అధికారంలో వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు.
తమ ప్రభుత్వం వచ్చాక ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. మనబడి నాడు-నేడు ద్వారా 57 వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీలో చిత్తూరు జిల్లా కుప్పం, నారావారిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కింద జరిగిన మార్పుకు సంబంధించిన ఫోటోలను అసెంబ్లీలో ప్రదర్శించారు.