ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఎలాంటి మార్ఫింగ్ లేదని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే పార్టీ సహించబోదన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వచ్చిన ఆరోపణల విషయమై ముఖ్యమంత్రితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ మాధవ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, దానిపై విచారణ జరుగుతోందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మాధవ్ ఖండిస్తున్నారని, అది మార్ఫింగ్ వీడియో అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతని ఫిర్యాదుపై పోలీసు విచారణ జరుగుతోందని, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మహిళలను కించపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే పార్టీ సహించదని స్పష్టం చేశారు.
గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై జగన్ వేగంగా స్పందించాలి : రఘురామకృష్ణంరాజు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీద ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో, ఎంపీ గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు వీడియోలు మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపిస్తే తప్ప ఘటనలోని అసలు విషయం బయటపడుతుంది. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ వేగంగా స్పందించాలి. పార్లమెంట్ సాక్షిగా నన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై మా పార్టీలో ఎవరు స్పందించాలన్నా తాడేపల్లి లో ఒక ‘కీ’ ఉంటుంది. తాడేపల్లి ‘కీ’ ప్రకారమే మా నేతలు నడుచుకుంటారు’ అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు