శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌లో సరుకులు దోపిడీ కొనసాగుతోంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్భా బాలికా విద్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రత్యేకాధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులకు సైతం పెద్ద ఎత్తున ముట్టజెప్పి తతంగాన్ని కానిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు వలసపోయిన కుటుంబాల్లో బాలికలు చదువుకు దూరం కాకుండా కేజీబీవీలను ఏర్పాటుచేశారు. 6 నుంచి పదో తరగతి వరకూ పాఠశాలలను ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పాఠశాలను నడుపుతున్నాయి. తొలుత జిల్లాలో 21 చోట్ల పాఠశాలలను ఏర్పాటుచేశారు. పౌష్టికాహారంతో పాటు ఉత్తమ విద్యాబోధన అందుతుండడంతో కేజీబీవీలకు ఆదరణ పెరిగింది. అడ్మిషన్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రభుత్వం మరో 11 మండలాల్లో కేజీబీవీలను విస్తరించింది. ఇటీవల జూనియర్ కాలేజీలుగా సైతం అప్ గ్రేడ్ చేసింది. మెనూ ప్రకారం భోజనంతో పాటు అన్నిరకాల మౌలిక సదుపయాలను కల్పిస్తోంది. ఒక ప్రత్యేకాధికారితో పాటు 12 మంది సీఆర్టీలు విద్యాబోధన చేస్తుంటారు. ఆరోగ్య పరిరక్షణకు ఒక ఏఎన్ఎం, రికార్డలు నిర్వహణకు ఒక అకౌంటెంట్, వంటకు కమాటీ, సహాయకులు ముగ్గురు, వాచ్ మెన్ ఒకరు విధులు నిర్వహిస్తుంటారు. ఏటా ఒక్కో పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతోంది. ప్రత్యేకాధికారి ఖాతాలో ఏ నెలకు ఆ నెల లక్ష రూపాయల వరకూ వేస్తోంది. ఇది విచక్షణాధికారం కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కూరగాయల్లో గోల్ మాల్
జిల్లాలో 32 కేజీబీవీ, 14 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏడాదికోసారి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కిరాణా సామగ్రికి టెండర్లు వేస్తారు. టెండర్లు ఖరారైనవారు నిబంధనల ప్రకారం ఆయా పాఠశాలలకు కూరగాయలు, కిరాణా సామగ్రి అందజేయాలి. కాగా, కొంతమంది టెండర్లదారులు రాజకీయ పలుకుబడితో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. టెండర్ల ప్రక్రియ టెండరింగ్ సాగిస్తున్నారు. స్వలాభం కోసం నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు. విద్యార్థులకు మెనూ సక్రమంగా అందజేయడం లేదు. గత ఏడాది నవంబరు 11న కిరాణా, కూరగాయల టెండర్లకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 45 మంది టెండర్లు దాఖలు చేశారు. కిరాణా సామగ్రికి సంబంధించి టెండర్లు ఖరారు చేశారు. పాలకుల ప్రమేయంతో కూరగాయలకు సంబంధించి పాత టెండర్‌దారులనే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక్కో పాఠశాలకు కిరాణా సామగ్రి కోసం రూ.1లక్ష, కూరగాయలకు సంబంధించి రూ.50వేలు చొప్పున టెండర్‌దారులు సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందుగా డీడీ చెల్లించాలి. టెండర్లు వేసి ఏడు నెలలవుతున్నా.. ఇంతవరకు ఖరారు చేయకపోవడంతో టెండర్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. ఏదైనా టెండర్‌కు సంబంధించి డీడీల కాలపరిమితి ఆరునెలలు మాత్రమే. డీడీలు తీసి ఏడు నెలలు అవుతున్నా టెండర్లు ఖరారు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా ఇంతవరకు టెండర్లు వేసే దాఖలాలు కనిపించడం లేదు.
టెండర్ వెనుక అక్రమాలు ఇవే
కూరగాయలు టెండర్ ఇంతవరకు ఖరారు చేయకపోవడానికి అనేక కారణాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ముందు నుంచీ పాఠశాలలకు సంబంధించి కిరాణా సామగ్రితో పాటు, కూరగాయలు కూడా జిల్లాకు చెందిన కొందరి పాలకులతోపాటు పాఠశాలల అధికారులకు తరలిపోతున్నాయి. దీంతో పాత టెండర్ దారులనే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీకి చెందిన ఓ కీలక నేత కూరగాయల టెండర్ ఖరారు కాకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తినే కూరగాయల టెండర్‌దారుడిగా కొనసాగించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సరుకులు పక్కదారి పట్టడంతో పాటు సక్రమంగా మెనూ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
టెండర్లు ఖరారు చేయలేదని మార్చి నెల 28న కలెక్టర్ స్పందన కార్యక్రమంలో టెండర్‌దారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మరో రెండు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు టెండర్లు ఖరారు కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. పాలకుల ప్రమేయం ఉండడంతో ఉన్నతాధికారులు కూడా టెండర్ల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులకు మెనూ సక్రమంగా అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.