ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి జీతం రూ. పద్దెనిమిది వేలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇప్పటికి వారికి ఇస్తోంది పదిహేను వేలు మాత్రమే. తమ సమస్యల విషయంలో ఇంత కాలం ఓపిక పట్టిన వారు ఇప్పుడు రోడ్డెక్కారు. సమ్మె ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా చెత్తపన్నును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. ఈ ప్రకారం పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. చెత్త పన్ను ఇవ్వకపోతే చెత్త ఇంటి ముందు పోయ్యాలనే హెచ్చరికలు కూడా మంత్రుల స్థాయి నేతలు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులకే సరైన జీతాలు అందడం లేదు. దీంతో వారు సమ్మెకు దిగాల్సి వచ్చింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మె బాట పట్టారు. ‘కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలి. పర్మినెంట్ కార్మికులకు సీపీఎస్ రద్దు చేయాలి. మెడికల్ సరెండర్ లీవు కల్పించాలి. కాంట్రాక్టు కార్మికులకు హెల్త్ అలవెన్సు బకాయిలు చెల్లించాలి. పీఆర్సీ ప్రకారం నెలకు 20 వేలు జీతం, కరువు భత్యం ఇవ్వాలి. అదనపు సిబ్బందిని నియమించాలి. పర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. పనిముట్లు, యూనిఫాం, సోపు, సబ్బు, నూనె, చెప్పులు అందజేయాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఒకే రకమైన జీతాలు చెల్లించాలి’ అన్న డిమాండ్లతో నిరసన తెలిపారు.
విశాఖ జిల్లా
తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ లోని మున్సిపల్ కార్మికులు మూడో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కార్మకులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు విశాఖలోని వేపగుంట డంపింగ్ యార్డ్ ముందు సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ నెల 14 నుంచి వాటర్ సప్లై కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతామని వెంకట రెడ్డి స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలో
చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగరాజు మాట్లాడారు. మున్సిపల్ పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు నెలలకు ముందే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేసినా నిర్లక్ష్యంగా ఉందన్నారు. అందుకే సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను సీఎంగా నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
కృష్ణాజిల్లా
ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని ఉయ్యూరు టీడీపీ, సీఐటీయూ నాయకులు ఆరోపించారు. పాద యాత్ర, అనంతరం ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఉయ్యూరు మున్సిపల్ వర్కర్స్, సీఐటీయూ ఆధ్వర్యాన పారిశుధ్య సిబ్బంది, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలో 61 మంది కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలో పాల్గొన్నారు.
మచిలీపట్నం టౌన్
కనీస వేతనం అమలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమస్యలపై కాంట్రాక్టు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె కొనసాగించారు. వర్షంలోనూ నిరసన ర్యాలీ నిర్వహించి కోనేరుసెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా హామీ నెరవేరలేదన్నారు.
గుడివాడ
గుడివాడలో రెండో రోజూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం సమ్మె కొనసాగించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సిపి.రెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వం కార్మికులకు రూ.12 వేలు వేతనం ఇచ్చిందన్నారు. అధికారానికి వస్తే రూ.18 వేలు ఇస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్ చెప్పారన్నారు. ఇటీవల పీఆర్‌సీ ప్రకటించడంతో మరో రూ.3వేలు పెరిగి రూ.21వేలు ఇవ్వాల్సిన ప్రభుత్వం మెడికల్ అలవెన్స్ రూ.6 వేలు ఆపేసిందన్నారు. పెరిగిన పీఆర్‌సి రూ.3 వేలతో కలిపి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మెడికల్ అలవెన్స్‌తో రూ.21 వేలు వేతనం ఇవ్వాల్సిందేనని కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు.
ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలో మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు
తిరుపతిలో పేరుకుపోతున్న చెత్తకుప్పలు
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మెతో తిరుపతి నగరంలో ఎటుచూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. పైగా దుర్గంధం వెదజల్లుతుండటంతో స్థానికులు, యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పేరుకున్న చెత్తాచెదారాన్ని పశువులు, కుక్కలు చిందరవందరగా చేసేస్తున్నారు. చాలాచోట్ల రోడ్డుపై ద్విచక్రవాహనాలతోపాటు నడిచి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత అధ్వానంగా తయారయ్యేలా ఉంది. దీనివల్ల వ్యాఽధులూ ప్రబలే ప్రమాదమూ లేకపోలేదు. కాగా.. బుధవారం పర్మినెంటు ఉద్యోగులతో చెత్త ఎత్తించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలి: మంత్రి సురేష్
మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమింపచేసుకొని చర్చలలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు డిమాండ్లను ఒకటి తప్ప అన్ని పరిష్కరించామన్నారు. రూ.18 వేల వేతనం చట్టబద్ధత కాదని తెలిపారు. దానిపై కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కార్మికులు తక్షణమే విధులకు హాజరుకావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ విజ్ణప్తి చేశారు.