విశాఖపట్నం : ఏటో మరి ఇసిత్రం.. ఊరందరికి తీర్పులిచ్చే నాయుడోరు తను మాత్రం పాటించడు.. మీరంతా అలా ఉండాలి.ఇలా ఉండాలి.. అంటూ రూల్స్..పద్ధతులు చెప్పే ఉత్తరాంధ్ర పెద్దాయన తనుమాత్రం రూల్స్ బ్రేక్ చేస్తాడు..ఇదేందిరా అయ్యా అంటే.. అంత పెద్దాయన ఇలాంటి చిన్న పనులకు ఎలా వస్తాడూ అంటారు.. మరేటి సేత్తామ్ అని పళ్లకోవడమే. మూడేళ్ళలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమేం చేసింది..ప్రజలకు సంక్షేమపథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నది.. ఏయే వర్గాలను ఎలా ఆదుకుంటున్నది వివరించే లక్ష్యంతో “గడపగడపకు వైఎస్సార్సీపీ” పేరిట ఓ కార్యక్రమం రూపొందించారు.
ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇతర ప్రజాప్రతినిధులు మొత్తం ఆర్నెళ్లపాటు తమ నియోజకవర్గాల్లో కలియదిరిగి ప్రతి గడపకూ వెళ్లి తాము అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించి మళ్ళీ ప్రజా మద్దతు కోరాలి. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు కూడా ఏదో కొద్ది రోజులు అయినా పాల్గొన్నారు.. అయితే రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రోగ్రాం ను ఎగ్గొట్టింది ఎవరయ్యా అంటే ఒకరువా కార్యక్రమ రూపకర్త , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇంకోరు ఎవరయ్యా అంటే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న బొత్స సత్తిబాబు.. సరిగ్గా ఈళ్ళిద్దరే ఈ ప్రోగ్రాములో ఒక్కరోజు కూడా పాల్గొనలేదట. నిన్న జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో స్టేట్ మొత్తం ఏ లెక్క తీస్తే ఈ ఇద్దరే ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని తేలింది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, సత్తిబాబు గెలిచిన చీపురుపల్లిలో గడపగడపకు జరగలేదని తేలింది. నేనేమిటి ఇంటింటికి వెళ్ళేది ఏమిటని అనుకున్నారో లేక దావోస్ పర్యటన వంటి పనుల్లో బిజీగా ఉన్నారో తెలీదుగానీ జగన్ మాత్రం ఆ కార్యక్రమానికి ఎటెండ్ కాలేదు.. మరి సత్తిబాబు ఎందుకు దూరంగా ఉన్నట్టూ.. ఒక్కపూట కూడా తీరికలేని రాచ కార్యాలు ఏమున్నాయ్.. అయినా నాకు చీపురుపల్లిలో ఎదురేముంది.. మనం ఇంటింటికి ఎందుకు పోవాలి అనుకున్నాడా ఏందో మరి.. అయినా ఇంకా ఆర్నెల్లు టైముంది కాబట్టి ఏదోరోజు వెళ్తారేమో చూడాలి.