సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుండగా.. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కొత్త సీజేఐ నియామక అంశంపై ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ నుంచి అభిప్రాయం కోరుతూ కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది. దీనిపైన సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీ పైన చర్చించింది. ప్రస్తుత సుప్రీంలో ఉన్న న్యాయమూర్తుల్లో సీనియర్ అయిన జస్టిస్ యూయూ లలిత్ పేరును ఖరారు చేసి కేంద్రానికి పంపింది. దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతి సంతకం చేస్తే ఆగస్టు 27న సుప్రీం 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ 2021 ఏప్రిల్ 21న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా సీజేఐ హోదాలో ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కాబోయే చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నవంబరు 9, 1957న జన్మించారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైన ఆరో వ్యక్తి జస్టిస్ లలిత్. జస్టిస్ లలిత్ భారత ప్రధాన నాయమూర్తిగా నియమితులైతే.. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌కి ఎలివేషన్ పొందిన రెండోవ సీజేఐ అవుతారు. ఇక, 1971 జనవరిలో 13వ చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ ఎస్‌ఎం సిక్రీ ఈ కోవలో మొదటివారు. ఇకపోతే.. యూయూ లలిత్ పలు కీలక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ కూడా ఓ సభ్యుడు. అలాగే, కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇలా పలు కీలక తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా వ్యవహరించారు. అయితే, సీజేఐగా ఆయన మూడు నెలల పాటు మాత్రమే కొనసాగనున్నారు. లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇక, భారత ప్రధాన న్యాయమూర్తి.. తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ పేరును సిఫార్స్ చేస్తారు. ప్రస్తుత సీజే ఎన్వీ రమణ తర్వాత.. జస్టిస్ యూయూ లలిత్ సీనియర్‌గా ఉన్నారు. సీనియారిటీ జాబితాలో జస్టిస్ యూయూ లలిత్ తర్వాతి స్థానంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.