గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గ్రామాలు, పట్టణాలను ముంచేస్తోంది. భద్రాచలం వద్ద 60 అడుగులను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా.. తాజాగా భద్రాద్రి రాముని ఆలయానికి వరద తాకింది. దీంతో భద్రాచలం పట్టణం చిగురుటాకులా వణికిపోతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో వరద రావడంతో మరో రెండు నెలలు పరిస్థితులు ఎలా ఉంటాయోనని తీర్ ప్రాంత ప్రజలు ఆందోళన చెదుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61.5 అడుగులకు చేరింది. 1986లో గోదావరి నదికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా కరకట్టను నిర్మించారు. దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. అయినప్పటికీ లీకేజీ లోపాలు శరాఘాతంలా మారాయి. అయితే 36ఏళ్ల తర్వాత గోదావరికి భారీగా వరద రావడంతో నీరు కరకట్టను తాకింది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి 24 గంటలు గడవక ముందే..
ప్రవాహ ఉద్ధృతి ఏకంగా 8 అడుగులకు మించిపోయింది. గంట గంటకూ ప్రవాహం పెరిగింది. ఇవాళ ఏకంగా 18 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. భద్రాచలం పట్టణానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి వారధి అతలాకుతలమైంది. దీంతో అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. 36ఏళ్ల తర్వాత గోదావరి వంతెనపై ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిషేధించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఫలితంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. సుభాష్‌నగర్, రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలను వరద ముంచెత్తింది. అప్రమత్తమైన అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 66 అడుగులు ఉంది. అది రాత్రికి 70 అడుగులకు చేరే అవకాశం ఉందని తెలిపారు. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం నుంచి కూనవరం, చర్ల మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
3 రాష్ట్రాలకు రాకపోకలు బంద్..
వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షపాతం గణనీయంగా నమోదుకావడం, ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి వారధి అతలాకుతలమైంది. వంతెన చరిత్రలో రెండోసారి రాకపోకలు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1986లో తొలిసారిగా గోదావరి నీటిమట్టం 75.6 అడుగులకు చేరడంతో ముందు జాగ్రత్తగా గోదావరి వారధిపై రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత 36ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి వంతెనపై ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిషేధించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు వారధిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. దీంతో.. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలకు భద్రాచలం నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 144 సెక్షన్ విధించారు.