ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి పోటా పోటీ వ్యూహాలతో అధికార పక్షం , ప్రధాన ప్రతిపక్షం ముందుకు సాగుతున్నాయి. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఉంటానని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశమే లభించిందాయనకు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి చేరువ కావడానికి, అందులో చేరడానికీ ఇప్పటివరకు ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి రూపంలో వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు అందిపుచ్చుకున్నట్టే కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అగ్ర నాయకులు ఓ అధికారిక ప్రకటన జారీ చేశారు. అత్యున్నత పదవిలో ఓ గిరిజన మహిళకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తాము ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న పొత్తును కాదనుకున్నారు. యూపీఏ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చే విషయంలో టీడీపీ యూటర్న్ తీసుకున్నట్టయింది. రాష్ట్రానికి రానున్న ద్రౌపది ముర్మును విజయవాడ గేట్‌వే హోటల్‌లో.. వారు కలుసుకోనున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ లోక్‌సభ సభ్యులు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, పొలిట్‌బ్యురో సభ్యుడు వర్ల రామయ్య.. తదితరులు ఆమెతో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం గుంటూరులోని పార్టీ కేంద్రం కార్యాలయం నుంచి ద్రౌపది ముర్ము బస చేయనున్న విజయవాడ గేట్‌వే హోటల్‌లో టీడీపీ నేతలు వెళ్లనున్నారు.. ద్రౌపది ముర్ముతో భేటీ కోసం చంద్రబాబు పెద్ద ఎత్తున లాబీయింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకులతో ఢిల్లీ స్థాయిలో తనకు ఉన్న పాత పరిచయాన్ని వినియోగించుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కీలకపాత్ర పోషించారంటూ వార్తలొచ్చాయి. ఆయనే స్వయంగా కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డికి ఫోన్ చేశారని, ముర్ముతో చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారనే ప్రచారం సాగుతోంది. తాజాగా భేటీ ఫిక్స్ కావడంతో రాయబారం ఫలించినట్టయింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్డీఏతో కలిసే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు ఈ కూటమి నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ప్రతిపక్ష పార్టీలతో సన్నిహితంగా మెలిగారు. తృణమూల్ కాంగ్రెస్ కోల్‌కతలో నిర్వహించిన బహిరంగ సభకూ వెళ్లారాయన. ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. యూపీఏకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్‌తో గానీ, ఇతర భాగస్వామ్య పక్షాలతో గానీ టచ్‌లో లేరు.
ఎన్డీఏ వైపు తొలి అడుగు
ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఎన్డీఏలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఇందులో భాగంగానే ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బేషరతుగా మద్దతు ప్రకటించారని అంటున్నారు. పార్లమెంట్‌లో టీడీపీకి ఉన్న సభ్యుల సంఖ్య నాలుగు కావడం, ఆయన ఇదివరకు యూపీఏతో జట్టు కట్టిన నేపథ్యంలో- బీజేపీ అగ్ర నాయకులెవరూ ముర్ము గెలుపు కోసం చంద్రబాబు సహకారాన్ని కోరలేదని సమాచారం.
బీజేపీ నాయకులు అడగకపోయినప్పటికీ.. చంద్రబాబే చొరవ తీసుకున్నారని, ఎన్డీఏతో కలవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్డీఏలో భాగస్వామి కాదు. అలాగనీ కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకూ మద్దతు ఇవ్వట్లేదు. దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వస్తోంది. అందుకే- తాను ఎన్డీఏ కూటమిలో చేరాలనేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.