సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో గురువారం వేకువజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. కూలీ పనుల నిమిత్తం ఉదయాన్నే వెళుతున్న కూలీల ఆటోపై విద్యుత్ హైటెన్షన్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆటోకు విద్యుత్ షాక్ తగిలి మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా తీవ్రం కావడంతో ఆటోలో ఉన్న అయిదుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు వేకువజామున తాడిమర్రి మండలం పెద్దకోట్ల పంచాయతీ గడ్డంనాగేపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పనుల నిమిత్తం కునుకుంట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ తలారి పోతులయ్య ఆటోలో చిల్లకొండయ్యపల్లికి బయలుదేరారు. ఆటో చిల్లకొండయ్యపల్లికి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో విద్యుత్ హైటెన్షన్ తీగలు తెగి ఆటోపై పడ్డాయి. దీంతో క్షణాల వ్యవధిలో ఆటోకు మంటలు వ్యాపించాయి. కూలీలు బయటకు వచ్చేలోపు ఆటో మొత్తం తగలిబడిపోయింది. అందులో ఉన్న అయిదుగురు సజీవదహనమయ్యారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా పూర్తిగా కాలిపోవడంతో వారు ఎవరిన్నది కూడా గుర్తించలేకుండా ఉంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి, సహాయక చర్యలు చేపట్టారు. మృతులు.. 1.రాములమ్మ , 2.రత్నమ్మ , 3.కొంకా పెద్ద కాంతమ్మ , 4.లక్ష్మి దేవి, 5.కుమారి గా గుర్తించారు. ఈ ప్రమాదంపై జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పొట్టికూటి కోసం కూలి పనులకు వెళుతున్న కూలీలు అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ..
కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. విద్యుత్ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు. అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి
సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీలు మృతి చెందడం విచారకరమని అన్నారు. జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
నారా లోకేశ్ మండిపాటు
కూలీలు మరణించిన ఘటన విషయంలో హనుమంతరావు స్పందనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఘాటుగా ట్వీట్ చేశారు. ‘‘తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి. ఇంకా నయం! కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయింది.’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి:ఏపీసీసీ
పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ విద్యుత్ తీగలు తెగి పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సాకే శైలజానాథ్ సూచించారు.
కూలీ పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోడం బాధాకరం-అచ్చెన్నాయుడు
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడడంతో ప్రమాదo జరిగిందని… దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు తెలిపారు.
అత్యంత ఘోరం -ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం గుడ్డం పల్లి గ్రామానికి చెందిన ఆటోలో కూలి పనికి వెళ్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి చనిపోయిన వారికి సంతాపాన్ని బాదిత కుటుంబాలకు నా సానుభూతిని భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేస్తున్నాను అన్నారు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది .
సోము వీర్రాజు @somuveerraju
సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం,చిల్లకొండయ్య పల్లిలో జరిగిన ఘటన అత్యంత విచారకరం. మృతుల పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేసి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
పరిహారం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు.