వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేశాం. ప్రతి రైతుకూ నాణ్యమైన విద్యుతను అందిస్తున్నాం అని పాలకులు ప్రకటనలు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్ అటుంచితే కనీసం విద్యుత కనెక్షన ఇస్తున్న దాఖలాలు లేవు. గడిచిన రెండేళ్లుగా కొత్త విద్యుత కనెక్షన్ల కోసం రాష్ట్రంలో రైతులు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోతుండగా, ప్రభుత్వం మాత్రం అరకొరగా కనెక్షన్లు మంజూరు చేస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 7,273 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఈ రైతులు విద్యుత శాఖ అధికారులు ఇచ్చిన ఎస్టిమేషన్ల ప్రకారం డబ్బులు కూడా చెల్లించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు. తమ దరఖాస్తు ఏమైందని రైతులు క్షేత్రస్థాయి అధికారులను అడుగుతున్నా, వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ఆ భూములకు విద్యుత కనెక్షన్లు లేక బీళ్లుగానే ఉంటున్నాయి.
బిల్లులు ఇస్తే కదా..?
రెండేళ్ల నుంచి రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నా, వేల సంఖ్యలో పెండింగ్ పడుతున్నా కొత్త కనెక్షన్లలో జాప్యం జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏపీఎస్పీడీసీఎల్ యాజమాన్యం నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడమేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాన్సఫార్మర్లు, విద్యుత వైర్లు, స్తంభాలు సరఫరా చేసేవారు, వీటిని ఏర్పాటుచేసే కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. విద్యుత్ సంస్థకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడమే ఈ బిల్లులు చెల్లింపుల ఆలస్యానికి కారణమని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. దీంతో మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా అరకొరగా కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి వ్యవసాయ కనెక్షనకు ప్రభుత్వం రూ.50 వేలు సబ్సిడీ ఇస్తుంది. ఒక కొత్త ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చేందుకు ముందుకు అవసరమైన ఎస్టిమేషన్లను అధికారులు తయారుచేస్తారు. ఆ ట్రాన్సఫార్మర్ పరిధిలోని రైతులకు ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని రైతులు భరించాల్సి ఉంటుంది. ఇది చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా ఏపీఎస్పీడీసీఎల్ నుంచి స్పందన అంతగా లేదు.
మారిన నిబంధనలు
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులకు విద్యుత కనెక్షన్లు మంజూరుచేయడంలో ఆలస్యం జరుగుతుండడంతో ఇక కొత్తగా దరఖాస్తులు రాకుండా కొత్తగా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ నిబంధనలు చూసిన రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం 15 రకాల పత్రాలు అవసరమంటూ నిబంధన తీసుకొచ్చిందని వారు వాపోతున్నారు. రైతులు కొత్త విద్యుత కనెక్షన పొందాలంటే పట్టా పాసుపుస్తకం, వీఆర్వో ఇచ్చే ఎనవోసీ, గడిచిన మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్న పంట వివరాలు, తహసీల్దార్ జారీ చేసిన వోల్టా సర్టిఫికెట్, బోర్ వేసినట్లుగా సంబంధిత ఏజెన్సీ నుంచి ధ్రువీకరణ పత్రం, బోరులో నీరు ఉన్నట్లు సంబంధిత అధికారుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తనకు విద్యుత మీటర్ అవసరమని స్వీయ ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుడితో పాటు తన కుటుంబం పేరు మీద ఎన్ని విద్యుత కనెక్షన్లు ఉన్నాయో తెలిపేలా అఫిడవిట్ ఇలా దాదాపు 15 రకాల పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ సమకూర్చుకోవాలంటే రైతులకు తలకుమించిన భారంగా మారుతోంది. దీంతో కొందరు రైతులు కొత్త కనెక్షన తీసుకునే ఆలోచనను విరమించుకుంటున్నారు. అయితే ఇన్ని పత్రాలు సమకూర్చుకున్నప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదు. ఫలితంగా సాగులోకి రావాల్సిన వేల ఎకరాల భూములు నిరుపయోగంగానే ఉన్నాయి. కాగా ఈ విషయమై వివరణకు విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామ రెవెన్యూ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సుమారు వంద ఎకరాలను గత ప్రభుత్వంలో మంజూరు చేశారు. ఆ భూముల్లో బోర్లు వేసుకొని పంటలు పండించుకోవాలంటే విద్యుత కనెక్షన్లు అవసరం. ఇందుకోసం కొంతకాలంగా విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వెబ్‌సైట్ పనిచేయడం లేదని, పలు రకాల పత్రాలు కావాలని అధికారులు రైతులను తిప్పి పంపుతున్నారు. ఈ విషయమై ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ ఎదుట పల్లవోలు గ్రామస్థులు వాపోయారు సంగం మండలం తరుణవాయికి చెందిన రైతు బోగిరెడ్డి శ్రీనివాసులురెడ్డికి మూడెకరాల పొలం ఉంది. ఆయనతో పాటు చుట్టుపక్కల ఉన్న భూములకు కూడా బోర్లే ఆధారం. దీంతో ఆ రైతులతో కూడా కలిసి కొత్త విద్యుత కనెక్షన కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఎస్టిమేషన్లు వేసి డబ్బులు కట్టమనగా, ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. అయితే రెండేళ్లయినా ఇప్పటికీ కనెక్షన ఇవ్వలేదు. దీంతో ఆయనతో పాటు రైతులంతా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.