రెండు దశాబ్దాల క్రితమే ఉద్యానవన శాఖ ద్వారా మొదలయిన ఈ పథకం కింద భారీగా రాయితీలు రావడం వ్యవసాయదారులకు మేలు చేసింది. కానీ గడిచిన మూడేళ్లుగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ నిలిచిపోయింది. ఆశతో ఎదురుచూసిన రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. త్వరలోనే డ్రిప్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు ప్రకటనలు చేసినా, ఆచరణలో కనిపించడం లేదు.
సాగునీటి పొదుపు కోసం ప్రవేశపెట్టిన బిందు, తుంపర సేద్యానికి గ్రహణం పట్టింది. రాష్ట్రంలో ఈ పథకం అమలు దాదాపుగా నిలిచిపోయింది. ప్రభుత్వం మంజూరు చేసినా ధరలు పెరిగాయంటూ కంపెనీలు రైతులకు పరికరాలు ఇవ్వడం లేదు. చేలో ప్రతి మొక్కకు చుక్కచుక్కగా నీరు అందేలా గొట్టాలను ఏర్పాటుచేయడం బిందుసేద్య విధానం. వర్షం మాదిరి పడేలా తుంపర్ల పరికరాలను అమర్చడం మరో పద్ధతి. ఈ రెండింటిలో ఏది ఏర్పాటు చేయాలన్నా పీవీసీ గొట్టాలు, వాటికి నాజిల్స్, వాటి నియంత్రణ పరికరాలు అవసరం. వాటి ధరలను ఉద్యానశాఖ నిర్ణయిస్తుంది.. ఉదాహరణకు 20 అడుగుల పొడవుండే ప్లాస్టిక్ గొట్టం ధరను రూ.369గా అప్పట్లో నిర్ణయించింది. కానీ ఇటీవలికాలంలో కంపెనీలు దాన్ని రూ.500 నుంచి 600 దాకా పెంచాయి. ప్రభుత్వం కూడా అంతే చెల్లించాలని లేకపోతే ఇవ్వలేమని నిరాకరించాయి. మరోవైపు పాత ధరల ప్రకారం రాయితీలివ్వడానికి కూడా ప్రభుత్వం ఉద్యానశాఖకు నిధులు విడుదల చేయడం లేదు.
మెట్ట ప్రాంతాల్లో అధికంగా బోర్ల కింద వివిధ పంటలు సాగు చేస్తారు. వీటికి బిందు, తుంపర్ల సేద్యం పరికరాలపై ఎక్కువుగా ఆధారపడుతారు. గత ప్రభుత్వం ఈ పరికరాలను రాయితీపై అందించి సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించింది. అయితే రెండేళ్లుగా ఏపీఎంఐపీ(ఏపీ మైక్రో ఇరిగేషన్ సంస్థ) ద్వారా రైతులకు ఎలాంటి రాయితీ పరికరాలు అందలేదు. ఈ సారైనా వస్తాయా, రావోనని రైతులు నిరాశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం బిందు, తుంపర్ల పరికరాలు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. దీంతో పలువురు రైతులు బిందు, తుంపర పరికరాల కోసం ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటిని త్వరితగతిన అందజేస్తే ప్రయోజనం చేకూరుతుందని పలువురు రైతులు అంటున్నారు.
ఉద్యాన శాఖ వద్ద దరఖాస్తు చేసుకున్న రైతులకు అర్హతను అనుసరించి పథకం వర్తింపజేశారు. దానికి అనుగుణంగా రైతు తన వాటా చెల్లించాల్సి వచ్చేది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రైవేటు కంపెనీకి ఆయా రైతు పొలంలో డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపుల నిర్మాణం, అవసరమైన వారికి స్ప్రింక్లర్ల ఏర్పాటు బాధ్యత అప్పగించేవారు. సంబంధిత పొలంలో వాటిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ద్వారా సబ్సిడీ మొత్తాన్ని కంపెనీకి చెల్లించే ప్రక్రియ సాగింది.
2018 నుంచే బకాయిలు పేరుకుపోయాయి. 2019-20లో ఇవ్వాల్సిన నిధులు రాలేదు. దాంతో కొత్తగా పైపులు కొనుగోలు చేసి రైతులకు అందించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా దఫదఫాలుగా విడుదల చేస్తామని చెప్పారు. అది కూడా కాలయాపన చేశారు.. 2022 మార్చిలో రూ.437.95 కోట్ల బకాయిలు విడుదల చేశారు. ఇంకా కొందరికి పెండింగ్ ఉంది. వాటిని కూడా చెల్లిస్తే కొత్తగా డ్రిప్ అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రైతుల నుంచి కంపెనీల మీద కూడా ఒత్తిడి ఉంది. కానీ నిధులు రాకుండా ఏమీ చేయలేని పరిస్థితి”.
ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతనలేదని డ్రిప్ ఇరిగేషన్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. డ్రిప్ పథకం అందుబాటులోకి రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని చిత్తూరు కు చెందిన రైతు వెంకట కృష్ణమ నాయుడు అన్నారు.
“డ్రిప్ లేకపోవడం వల్ల కడవలతో తెచ్చి చెట్లకు నీళ్లు పోసుకుంటున్నాం రైతులు వాపోతున్నారు.. ఆఫీసులో పోయి అడిగితే ఆస్కీమ్ ఇప్పుడు లేదంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాక్టర్‌కి వెయ్యి రూపాయల బాడుగ ఇచ్చి నీళ్లు తోలుకుంటున్నాం. కడవలతో పోవడం వల్ల ఎక్కువ నీళ్లు పడతాయి. నేల గట్టిగా అయి చెట్లకు పెరుగుదల ఉండదు. డ్రిప్ వేయడం వల్ల తక్కువ నీళ్లు పడతాయి. మట్టి వదులుగా ఉండడంతో చెట్లు బాగా పెరుగుతాయి. డ్రిప్ స్కీం ఉంటే సబ్సిడీ వస్తుంది. రైతులకి కష్టాలు లేకుండా ఉంటాయి. ఇప్పటికైనా డ్రిప్ పథకం అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు రైతులు..
పెరిగిన ఉద్యానవన సాగు
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేఎస్వై) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సూక్ష్మ సేద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ) ద్వారా బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించారు. రైతులకు భారీగా సబ్సిడీ లభించడంతో అత్యధికులు మొగ్గు చూపారు. ముఖ్యంగా రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో సాగునీటి కాలువలు అందుబాటులో లేని రైతులు, ఉద్యానవన పంటల సాగుదారులకు ఇది బాగా ఉపయోగపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదికల ప్రకారం.. 2014-15 నుంచి 2019-20 వరకూ 7,38,659 ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం పథకం అమలు చేశారు. అందులో అత్యధికంగా 2018-19లో 1.94 లక్షల ఎకరాల్లో ఈ డ్రిప్, స్ప్రింక్లర్లు అందుబాటులోకి వచ్చాయి. 2019-20లో ఇది 1.04 లక్షల ఎకరాలకు పరిమితమయింది.
రాయలసీమ రైతులకే ఎక్కువ మేలు
ఈ బిందు, తుంపర సేద్యం అధికంగా రాయలసీమ రైతులకు మేలు చేసింది. రాష్ట్రంలో 60 శాతం లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కింది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటుగా ప్రకాశం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు కూడా ఎక్కువగా డ్రిప్ వైపు మొగ్గు చూపారు. మిగిలిన జిల్లాల్లో కూడా మెట్ట ప్రాంతంలో వివిధ ఉద్యాన పంటల సాగు కోసం ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు పొందినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం పేరుతో 2002లోనే ఆంధ్రప్రదేశ్‌లో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహకాలు అందించడం మొదలయింది. ఆ తర్వాత మరింత విస్తృతమయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా తోడు కావడంతో ఇది మరింత వేగంగా విస్తరించింది. ఫలితంగా ఉద్యాన పంటల సాగులో ఆంధ్రప్రదేశ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అరటి వంటి పంటల సాగులో మొదటి స్థానానికి చేరడంలో ఈ పథకం తోడ్పాటు కూడా ఉంది