రాష్ట్రంలో ఫేక్ ట్వీట్ వార్ ముదురుతోంది. ఫేక్ ట్వీట్లు.. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని తెలుగుదేశం సీరియస్‌గా తీసుకుంది. అంబటి – దేవినేని ఫేక్ ట్వీట్, గౌతు శిరీష ఘటనల తర్వాత అసత్య ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లక్ష్యంగా అసత్యాలు ప్రచారం చేసిన ఫేక్ న్యూస్‌తో బుక్‌లెట్ వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు, అయ్యన్న, దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు సహా వివిధ నేతల పేర్లతో చేసిన అసత్య ప్రచారాల వివరాలను బుక్ లెట్లల్లో పొందుపరచాలని భావిస్తోంది.
ఫేక్ ట్వీట్లపై 25 సార్లు ఫిర్యాదు చేసినా.. సీఐడీ పట్టించుకోవట్లేదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల కాపీలను కూడా బుక్ లెట్‌లో ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ముందు పింక్ డైమండ్, బాబాయ్ హత్య, కోడి కత్తి వంటి అంశాలను బుక్ లెట్లో ప్రచురించాలని తెదేపా భావిస్తోంది. గతంలో “ఊరికో ఉన్మాది” పేరుతో బుక్ లెట్ వేసిన తరహాలోనే జగన్ మోసపు రెడ్డి పేరుతో బుక్ లెట్ విడుదల చేసి.. వాటి ప్రతులను ఇంటింటికి పంపిణీ చేయనుంది. వైకాపా అసత్య ప్రచారాలను ప్రజలకు తెలిసేలా.. ‘జగన్ మోసపురెడ్డి- ఏపీ ఫేక్ ఫెలోస్’ పేరుతో సామాజిక మాధ్యమం వేదికగా ప్రచారం చేసేందుకు తెలుగుదేశం కసరత్తు చేస్తోంది.
మంత్రి అంబటి పై సీఐడీ డీఐజీకి దేవినేని ఉమా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేక్ ట్వీట్‌ల రచ్చ కొనసాగుతున్నది. వారం క్రితం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్లతో ట్వీట్‌లు వైరలయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ట్వీట్లు రావడం మొదలయ్యాయి. దేవినేని ఉమా రంగంలోకి దిగి సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేక్ ట్వీట్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
తన పేరుతో వచ్చిన నకిలీ ట్వీట్లను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రచారం చేస్తున్నారని, అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా పోలీసులను కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసినట్లుగా ఒక నకిలీ ట్వీట్ వైరల్ చేసినట్లు దేవినేని ఉమా తెలిపారు. వారం క్రితం వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై కూడా ఇలాంటి నకిలీ ట్వీట్లు పెట్టి వేధించారని గుర్తు చేశారు. చివరకు చంద్రబాబు సంతకం, లెటర్ హెడ్‌ను కూడా ఫోర్జరీ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఫేక్ ట్వీట్లను షేర్ చేస్తుండటానికి సీఎం జగన్ బాధ్యత వహించి ఏపీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు..
అమ్మఒడి, వాహనమిత్ర పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, 2022లో లబ్ధిదారులకు ఈ పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ తెదేపా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు.
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష.. సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారనే నెపంతో సీఐడీ అధికారులు ఆమెకు నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాష్టీకాలు, రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో ఆమెపై తప్పుడు కేసులు పెట్టడం తగదన్నారు. సామాజిక మాధ్యమంలో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్ చేశాననే విషయాన్ని ఆమె ధైర్యంగా ఒప్పుకొన్నారన్నారు. ఇప్పటికే తమ పార్టీ నేతలు కె.అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు.రాష్ట్రంలో ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా స్పందించకుండా.. ఎవరో పెట్టిన పోస్టుపై స్పందించిన శిరీషకు సీఐడీ నోటీసులివ్వడం ఏంటని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. శిరీష మాట్లాడుతూ ఏ తప్పూ చేయకపోయినా తనను పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు.