ఇదే వైసీపీ సర్కారు అమలుచేస్తున్న నూతన విద్యావిధానం
117, 128, 84, 85 జీవోలతో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ
గందరగోళంలో ఉపాధ్యాయులు, ఆందోళనలో విద్యార్థులు
ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోన్న ప్రభుత్వం
విద్యావ్యవస్థకి శాపంగా మారిన జీవోలను ఇప్పటికైనా రద్దు చేయాలి
వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం
విద్యాసంస్కరణల పేరుతో వైసీపీ సర్కారు అమలు చేస్తోన్న 117 జీవో టీచర్లపై కక్ష సాధించేలా వుందని, విద్యార్థులకి శిక్షగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం సర్కారు జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. మూడేళ్ల వైసీపీ సర్కారు అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాల వల్ల విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిందనే విషయాన్ని ఇటీవల వెల్లడైన పరీక్షల ఫలితాలు వెల్లడించాయన్నారు. పదవ తరగతిలో 67.26 శాతం, ఇంటర్లో 61 శాతం అత్యల్ప ఉత్తీర్ణత సాధించడం విద్యాప్రమాణాలు దిగజారాయనడానికి నిదర్శనమన్నారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ మూడేళ్ల జగన్‌రెడ్డి పాలనలో 19వ స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యావ్యవస్థ పతనమైన దశలో సంస్కరణల పేరుతో టీచర్ రేషనలైజేషన్, పాఠశాలల విలీనం కోసం సర్కారు జారీచేసిన 117, 128, 84, 85 జీవోలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారాయన్నారు.
పాఠశాలల విలీనంతో నిరుపేద పిల్లలు విద్యకి పూర్తిగా దూరమై బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఊర్లో, ఇంటి పక్కనే ఉన్న బడిని 3 కిలోమీటర్ల దూరం చేయడం వల్ల తల్లిదండ్రులు కూలి పనులకి వెళ్లిపోతే ఇంటి నుంచి వాగులు, వంకలు, రోడ్లు దాటుకుని ఏ పిల్లాడు బడికి వెళ్తాడని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు, తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడిన ఉపాధ్యాయులపై కక్ష సాధించేందుకు నూతన విద్యావిధానాన్ని జగన్‌రెడ్డి సర్కారు ఒక ఆయుధంగా వాడుతోందన్నారు. వారానికి 24 నుండి 30 పీరియడ్లు మాత్రమే చెప్పగలిగిన ఉపాధ్యాయులు వైసీపీ సర్కారు తెచ్చిన జీవో ప్రకారం వారానికి 40 నుండి 48 పీరియడ్లు పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
తరగతి గదుల్లోనే టీచర్లు వుంటే పాఠాలు ప్రిపేర్ అవడానికి, నోట్స్ కరెక్ట్ చేయడానికి, పేపర్లు దిద్దడానికి, ఇతరత్రా సమాచారం యాప్‌లలో అప్ చేయడానికి ఇంకెక్కడి సమయం ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తలకు మించిన భారంగా పీరియడ్లు పెంచేసి, 8 గంటలైనా ఉపాధ్యాయులు స్కూల్‌లో పనిచేయలేరా అని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్లను వెటకరించడం ముమ్మాటికీ వేధింపుల్లో భాగమేనని స్పష్టం అవుతోందన్నారు. మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తూ, పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ టీచర్లని బెదిరించేలా మంత్రి బొత్స మాట్లాడటం ప్రభుత్వం నిరంకుశ తీరుకి అద్దం పడుతోందన్నారు. కొత్తగా అమలు చేస్తోన్న విద్యావిధానంలో అనేక హైస్కూళ్లలో హెడ్‌మాస్టర్, పీఈటీ, సబ్జెక్ట్ టీచర్లు ఉండరని, ఇలా అయితే విద్యాప్రమాణాలు ఎలా మెరుగుపడతాయని ప్రశ్నించారు. టీచర్లపై కక్షతో విద్యార్థుల్ని శిక్షిస్తున్నారన్నారు. ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి పూర్తిగా మారిపోతోందని, విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుందని, భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకుండా ఈ విధానం బలవంతంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు వద్దంటున్నా, ఉద్యమిస్తున్నా మొండిగా వెళ్తోన్న సర్కారు తీరుతో విద్యావ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థని అస్తవ్యస్తం చేసి, ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా వున్న 117, 128, 84, 85జీవోలు వెనక్కి తీసుకోవాలని ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. పోరాటబాట పట్టిన టీచర్లను బెదిరించేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కడం మానుకోవాలని హితవు పలికారు. పాఠశాలల్లో బోధనేతర పనుల సమాచారాన్ని సకాలంలో యాప్‌లలో నమోదు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ వైసీపీ సర్కారు మార్క్ బ్లాక్ మెయిలింగేనని దుయ్యబట్టారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపైనా ఇటువంటి కుతంత్రపు చర్యలకి దిగితే వారికి మద్దతుగా టిడిపి పోరాటానికి వెనుకాడదని హెచ్చరించారు. విద్యావ్యవస్థని నాశనం చేసే ఈ జీవోలని అన్నివర్గాలు వ్యతిరేకించడాన్ని పరిగణనలోకి తీసుకుని జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంస్కరణలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులు-వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘాలు, విద్యావేత్తలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.