రాష్ట్రపతి ఎన్నికకు యావత్ దేశం సిద్ధమవుతోంది. జులై 18న జరిగే ఈ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓటర్లుగా ఉంటారు. ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు విభిన్న ఓటు విలువ కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటును గుర్తించేందుకు వీలుగా వారు రెండు రకాల బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఆకుపచ్చ, పింక్ రంగులతో కూడిన బ్యాలెట్ పేపర్లు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు చేరుకున్నాయి. ఆకుపచ్చ బ్యాలెట్ పేపర్‌లో ఎంపీలు, పింక్ పేపర్‌లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు. బ్యాలెట్ పేపర్ రంగు ద్వారా అది ఏ ప్రజాప్రతినిధిదో గుర్తించి వారికి ఉన్న ఓటు విలువ కింద దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా నిర్థారిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. దీని ప్రకారం యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా ఝార్ఖండ్-తమిళనాడు రాష్ట్రాలకు అది 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్‌లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. ప్రస్తుతం సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ మొత్తంగా 10,86,431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌ను హైదరాబాద్‌కు చేరుకుంది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్ బాక్స్‌ను ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి అధికారులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఈ ఎన్నికలకు హైదరాబాద్ ఏఆర్‌వోగా వ్యవహరిస్తున్న ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్, సీఈవో కార్యాలయ అసిస్టెంట్ సెక్రటరీ విజయ్‌కిషోర్ ఢిల్లీకి వెళ్లారు. భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశ్వినీకుమార్ మొహల్.. హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారుల బృందానికి బ్యాలెట్‌బాక్స్‌ను అందించారు. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటలకు బయలు దేరి అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది.
ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. భారత ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణకు అసవరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్స్, స్పెషల్ పెన్స్, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్‌తోపాటు ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సామగ్రిని తరలిస్తోంది. ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది. ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంపుతారు. విమానాల్లో ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో ఎయిర్ టికెట్ బుక్ చేస్తారు. విమానం ఫ్రంట్ రో (మొదటి వరుస సీట్లు)లో ఈ సీటు బుక్ చేస్తారు. పక్కనే వీటిని తీసుకెళ్లే ఒక ప్రత్యేక అధికారి కోసం సీటు బుక్ చేస్తారు. ఈ బాక్సులను ఎన్నికలు నిర్వహించే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కు అందజేస్తారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. 21న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.