అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు విపక్ష టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమౌతున్న నేపథ్యంలో… ఒకవిధమైన ఒత్తిడితో కూడుకున్న వాతావరణంలో వైసీపీ ప్లీనరీ జరగనుంది. వైఎస్ జయంతి (జూలై 8) సందర్భంగా శుక్రవారం, శనివారం గుంటూరు జిల్లా కాజ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సన్నాహకంగా నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో ‘ప్లీనరీ’లు జరిపారు. చాలాచోట్ల వేదికలు నేతలతో నిండిపోగా సమావేశ మందిరాలు కార్యకర్తలు లేక వెలవెలబోయాయి. వచ్చిన వాళ్లు వెనక్కి తిరిగి వెళ్లకుండా కొన్నిచోట్ల గేట్లకు తాళాలు కూడా వేశారు. చాలా ‘ప్లీనరీ’లలో ఎమ్మెల్యే స్థాయి నేతలు సైతం అసంతృప్తి గళం వినిపించారు. మరీ ముఖ్యంగా కార్యకర్తలకు బిల్లులు చెల్లించలేకపోవడం, సంక్షేమ పథకాల్లో లొసుగులు, అభివృద్ధి పనులు ఆగిపోవడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చారు. జిల్లా, నియోజకవర్గస్థాయి ప్లీనరీలు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రస్థాయి ప్లీనరీపై వైసీపీ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది. ప్లీనరీకి హాజరుకావాలనే ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో కనిపించడంలేదఅనేది వాదన వినిపిస్తుంది… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ ఏర్పాట్లపై ముఖ్యనేతలతో సమీక్షించారు. ప్రధానంగా జన సమీకరణపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. అధికార పార్టీ హోదాలో జరుగుతున్న ప్లీనరీకి భారీగా జనసమీకరణ జరగాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడి నుంచి కిందిస్థాయి వరకూ భోజన ఏర్పాట్లు ఒకేలా ఉండేలా చూడాలని జగన్ సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న విపక్షాలపై ఎదురుదాడి చేయడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. తొలుత… 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో నిర్వహించారు. ఆ తర్వాత ఆరేళ్లకు 2017 జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా కాజ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్లీనరీ జరిగింది. ఈసారి కూడా ఇదే ప్రాంగణంలో పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి… మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విశాఖలో ప్లీనరీని నిర్వహిస్తారని భావించారు. కానీ… నాగార్జున వర్సిటీకి ఎదురుగా గతంలో నిర్వహించిన ప్లీనరీ తర్వాతే అధికారంలోకి వచ్చామన్న సెంటిమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరుగుతున్న తొలి ప్లీనరీ సమావేశం ఇది. దీంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలకు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు సమావేశాలకు తరలి వచ్చేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల వార్లీగా ప్లానింగ్ చేస్తున్నారు. రెండో రోజు ముగింపు సమావేశానికి లక్ష మంది వస్తారని అంచన వేస్తున్నారు.నాగార్జున వర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో రేపు, ఎల్లుండి ప్లీనరీ జరగనుంది. కీలక అంశాలపై చర్చ జరగనుంది.
మొదటి రోజు కంప్లీట్ షెడ్యూల్
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ ఎజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీలో కీలక అంశాలపై నేతలు చర్చించనున్నారు. మొదటి రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ సభ్యుల రిజిస్ట్రేషన్ ఉంటుంది. 10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండాను అద్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన జరుగుతుంది. 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. 10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. ఈ ప్రకియను సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తారు.
సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం ఉంటుంది. జగన్ స్పీచ్ తరువాత పార్టీ జమా ఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం ఉంటుంది. అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం జరుగుతుంది. 11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాల నివేదన ఉంటుంది. ఆ తర్వాత తీర్మానాలు ప్రారంభం అవుతాయి, 11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం ఉంటుంది. ఈ తీర్మానం పై మంత్రులు ఉషాశ్రీ చరణ్, రోజా, ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతారు. రెండో అంశంగా విద్యపై తీర్మానం ఉంటుంది. ఒంటి గంటకు విద్యపై తీర్మానం చేస్తారు.
వైసీపీ ప్లీనరికి విజయమ్మ
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది. చాలా కాలంగా విజయమ్మ ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ ప్లీనరీలో విజయమ్మ ఏమి మాట్లాడతారు అనే ఆసక్తి నెలకొంది.
వైఎస్.విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలు.. కానీ 2019 ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీంతో రక రకాల ప్రచారాలు జరిగాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె వైసీపీ ప్లీనరీకి హాజరు అవుతున్నారు. విజయమ్మ కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లో తిరుగుతున్నారు. విజయమ్మ కూడా ఆమెకు సహాయంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. జగన్ కు వీళ్ళకు మధ్య బాగా గ్యాప్ ఉందనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. అయితే ప్లీనరీకి వైఎస్ విజయమ్మ రానుండడంతో ఈ ప్రచారానికి ఇకనైనా తెర పడుతుందా అనేది చూడాలి. విజయమ్మ స్పీచ్‌పై కూడా ఆసక్తి ఏర్పడింది. జగన్ పాలనపై ఏం మాట్లాడతారు? తల్లిగా జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దిశ, విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ, వైద్యం, పరిపాలనలో పారదర్శకత… అనే ఐదు అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టి ఆమోదిస్తారు. శనివారం ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొంటారని సమాచారం. జగన్ ముగింపు ఉపన్యాసం చేస్తారు.
ప్రజలకు మేలు చేయడమే అజెండాగా ప్లీనరీ-సజ్జల
ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, ప్రజలకు మేలు చేయడమే ఏకైక అజెండాగా ప్లీనరీ నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.