పశ్చిమగోదావరి ఆక్వా రైతుకు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చింది. ఆక్వా జోన్ నిబంధన తేవడంతో సబ్సిడీకి ఎసరు పెట్టింది. జిల్లాలో ఇప్పటికే వరి సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా రంగం కూడా అదే బాటలో ఉంది. రొయ్యలు, చేపల ధర తగ్గిపోవడం, మేత, సీడ్ ధరలు పెరిగి పోవడంతో సాగు నిర్వహణ రైతుకు భారంగా మారింది. అదే సమయంలో విద్యుత్ సబ్సిడీ కోత ఆక్వా రైతును మరింత సంక్షోభంలో నెట్టివేయనుంది.
తెరపైకి ఆక్వా జోన్ నిబంధన
ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం జీవో నెంబరు . 49 జారీ చేసింది. దీనితో వేలాది మంది చిన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ అందని పరిస్థితి నెలకొంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఆక్వా చెరువుకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చింది. యూనిట్ ధర రూ.3.85 పైసలు ఉండగా రూ.2 చొప్పున ఆక్వా చెరువులకు ఏడాది పాటు విద్యుత్ అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిట్ రూ.1.50 పైసలు చొప్పున జిల్లాలోని 20,300 విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులు అందరూ లబ్ధి పొందారు. తాజాగా ఆక్వా జోన్ పరిధిలో ఉన్న రైతులకు మాత్రమ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది చిన్న రైతులు సబ్సిడీ కోల్పోయారు. ఆక్వా జోన్ పరిధిలోని ఐదెకరాల లోపు రైతులకు మాత్రమే సబ్సడి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత నెలలో ముఖ్యమంత్రి గణపవరం పర్యటనకు వచ్చినపుడు పదెకరాలలోపు రైతులకు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు.
చెరువులకు అనుమతి ఇచ్చారు కదా..!
ఆక్వా జోన్ పరిధిలో చెరువులకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ వర్తిస్తుందనే జీవో విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ యూనిట్ రూ.1.50 పైసల చొప్పున అందించడంతో ఆక్వా జోన్ పరిధిలో లేని చిన్న రైతులు వరి చేలను ఆక్వా చెరువులుగా మార్పు చేశారు. చెరువుల తవ్వకానికి అధికారులే అనుమతి ఇచ్చారు. నాన్ ఆక్వా జోన్ లో చెరువుల తవ్వకం ఎలా అనుమతించారు? ఇపుడు విద్యుత్ సబ్సిడీకి ఆక్వా జోన్ నిబంధన ఎలా విధించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆక్వా జోన్ విభజనకు ప్రభుత్వం 2012 – 2013లో ప్రతిపాదనలు చేసింది. 2016లో ఆక్వా జోన్ సర్వే చేసినా అసంపూర్తిగా ఉంది. సర్వే అసంబద్ధంగా సాగిందని రైతులు అప్పట్లో గగ్గోలు పెట్టారు. అయినా చెరువులు తవ్వడానికి అనుమతులు ఇచ్చేశారు. విద్యుత్ సబ్సిడీ విషయమై ఆక్వా జోన్ మెలిక పెట్టారు. ప్రభుత్వం అనుమతించిన చెరువులకు ఆక్వా జోన్ కాదంటూ సబ్సిడీ ఎలా నిలిపివేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాన్ ఆక్వా జోన్ అయినప్పుడు చెరువులను ఎలా అనుమతించారని నిలదీస్తున్నారు.
చెరువు గట్లు కొట్టాల్సిందే..
ఆక్వా చెరువులకు ఏడాది పాటు అందిన సబ్సిడీ ఇక వర్తించదని తెలిసిన రైతులు చెరువు గట్లు కొట్టేయాల్సిందేనని వాపోతున్నారు. ఆక్వా విద్యుత్ కనెక్షన్‌కు యూనిట్ రూ.1.50 పైసల చొప్పున విద్యుత్ అందించడంతో ఏడాది కాలంలో అధిక శాతం చిన్న రైతులు వరి చేలను చెరువులుగా తవ్వేశారు. జోన్ నిమిత్తం లేకుండా కొన సాగిన విద్యుత్ సబ్సిడీ తాజా నిబంధనతో నిలిచిపోయింది. 60 నుంచి 70 శాతం మంది సబ్సిడీ కోల్పోతున్నారు. మరోవైపు ఆక్వా సాగులో అడుగడుగునా నష్టాలు చూస్తున్న రైతులు చెరువులు మూసేయడానికి సిద్ధ పడుతున్నారు. అదే జరిగితే అటు వరి, ఇటు ఆక్వా సాగు నిలిచిపోయి రైతులతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయి. ఆక్వా జోన్ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆక్వా రంగ నిపుణులు సూచిస్తున్నారు.