కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
ఈ దేశంలోని మహిళలు, పిల్లలను ప్రోత్సహించడం, రక్షించడం, సాధికారత కల్పించడం కోసం ఎనిమిదేళ్లుగా అవిశ్రాంతంగా నిబద్ధతతో కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. మహేంద్రభాయ్ ముంజపరా అన్నారు.
విశాఖపట్నంలో ఆశావాహ జిల్లాలపై సౌత్ జోనల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రభాయ్ ముంజపరా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళలు మరియు బాలికలను హింస మరియు వేధింపుల నుండి రక్షించడానికి అంకితభావంతో పని చేస్తోందన్నారు. అదే విధంగా నేరాలను నివేదించేందుకు అడ్డంకిగా ఉన్నఇబ్బందులను సవాలు చేస్తూ సురక్షితమైన సమాజాన్ని నిర్మించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
2015 సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 708 ‘వన్ స్టాప్ సెంటర్లు’ అందుబాటులోకి వచ్చాయని, లింగ ఆధారిత హింస నుంచి బయటపడిన వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 5.2 లక్షల మంది మహిళలకు ఈ వన్ స్టాప్ సెంటర్ల ద్వారా మద్దతు లభించిందని ఆయన తెలిపారు.
కేంద్రం ఏర్పాటు చేసిన నిర్భయ నిధి 34 కొత్త ప్రాజెక్ట్‌లు/స్కీమ్‌ల ఏర్పాటుకు మద్దతిచ్చిందని, ఈ మొత్తం దాదాపు రూ. 10 వేల కోట్లకు చేరిందని మంత్రి అన్నారు. మహిళలకు రక్షణ భద్రతను పెంపొందించడంతో పాటు, బహిరంగ ప్రదేశాలను సైతం వారికి సురక్షితమైనదిగా చేయడం ఈ నిధి ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు.
ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు పోషకాహారం కేంద్ర బిందువుగా ఉంటుదన్న మంత్రి మానవ వనరుల అభివృద్ధి, ఉత్పాదకత పెరుగుదలకు తోడ్పడుతుందని, తద్వారా అంతిమంగా జాతీయ వృద్ధికి నేరుగా అనుసంధానం చెందుతుందనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపు 12 లక్షల గ్రోత్ మానిటరింగ్ పరికరాలను మరియు 11 లక్షలకు పైగా స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన POSHAN ట్రాకర్ ద్వారా పాలనను మెరుగుపరచడంతో పాటు పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించడానికి, మరియు చికిత్స చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా పక్కా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు ఉన్నాయని, 11 లక్షలకు పైగా కేంద్రాల్లో ఫంక్షనల్ టాయిలెట్లు ఉన్నాయని, మిగిలిన అన్ని అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా మరియు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి పధకాల ద్వారా మహిళల నేతృత్వంలోని కుటుంబాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు.
ఒకే గొడుగు కిందకు ప్రభుత్వ లక్ష్యాలైన పోషణ, శక్తి మరియు వాత్సల్య లను తీసుకురావడం ద్వారా మహిళలు మరియు పిల్లల సాధికారత, భద్రత మరియు రక్షణకు భరోసా, సంపూర్ణ మరియు సమతుల్య పోషకాహారాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ కృషిని మంత్రి వివరించారు.
కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇందేవర్ పాండే మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాలలో ఒకటైనందువల్ల, దేశం సుభిక్షంగా, ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పోషకాహార అవసరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. దేశంలోని పోషకాహార అవసరాలపై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టిందని అన్నారు. ‘ శిశువు దేశం యొక్క ఆస్తి’ అని ఆయన వ్యాఖ్యానించారు. పోషన్ ట్రాకర్‌ను సరిగ్గా ఉపయోగించడం ద్వారా పిల్లల ఆరోగ్య స్థితిని సులభంగా అంచనా వేయవచ్చన్నారు.
దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా సరైన ఫీడ్ బ్యాక్ ను పొందేందుకు పోషన్ ట్రాకర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, తద్వారా అంగన్వాడీ మరియు పంచాయతీ స్థాయిలలో అవసరాలు మరియు ఆకాంక్షలపై దృష్టి సారించేందుకు దోహద పడుతుందని వివరించారు. పోషణ్ అభియాన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలపై మరింత దృష్టి సారించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా విస్తరించిన అంగన్వాడీ నెట్వర్క్ ద్వారా 0-6 ఏళ్లలోపు 54% మంది పిల్లలు కవర్ అవుతున్నారని ఆయన సూచించారు.