పశ్చిమ గోదావరి : ఆమె మరుగుజ్జు.. తల్లిదండ్రులకు ఆమె వివాహమే ఒక చింత. ఎట్టకేలకు మరో మరుగుజ్జుతో వివాహం కావడంతో వారి దాంపత్యం సంతోషంగా సాగుతోంది. ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవడం, చుట్టు పక్కల వారు మీకు పిల్లలు పుట్టరు అని చెప్పడంతో ఆమె కుమిలిపోయింది. వైద్యులను సంప్రదిస్తే వారూ అదే చెప్పడంతో ఆమె బాధ వర్ణనాతీతం. ఆమె గర్భం దాల్చినా అబార్షన్ అయింది. 15 ఏళ్లుగా తల్లి కావాలనే ఆమె ఆశ నెరవేరలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక డాక్టర్ ఆమెను పరీక్షించి, వైద్య పరీక్షలు చేసి ఆమెకు తల్లి అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో మరుగుజ్జు మహిళ పొంగిపోయింది. రెండోసారి గర్భం దాల్చడంతో వైద్యరాలి పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవడంతో పండంటి కవలలకు జన్మనిచ్చింది.
కౄష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నారాయణపురానికి చెందిన మరుగుజ్జు యువకుడు కొపనాతి రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం లోసరి పంచాయతీ పరిధిలోని గరవడి దిబ్బ ప్రాంతానికి చెందిన మరుగుజ్జు యువతి నాగలక్ష్మితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులు పిల్లలు కోసం చాలా కాలం ఎదురుచూశారు. రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా కావడంతో చుట్టుపక్కల వారు మీకు పిల్లలు పుట్టరని చెప్పారు. దీనితో ఆ దంపతుల వేదనతో పలువురు వైద్యులను సంప్రదించారు. కొందరు వైద్యులు కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆకివీడులోని ఒక మహిళా వైద్యురాలిని సంప్రదించారు. ఏడాది నుంచి ఆమెను పరీక్షించి, వైద్యం చేయడంతో నాగలక్ష్మి గర్భం దాల్చింది. ఆ వైద్యురాలి పర్యవేక్షణలో ఆమె సలహా సూచనలతో మందులు వాడింది. ఈ నెల 8న ఆమెకు నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరింది. వైద్యురాలు కవిత ఆపరేషన్ చేయడంతో పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ముద్దులొలికే చిన్నారులను చూసి ఆ చిన్ని తల్లి మురిసిపోయింది. పిల్లలు పుట్టరు అనుకున్న తాను ఒకే సారి ఇద్దరు బంగారు తల్లులకు తల్లినయ్యానంటూ ఆనందం వ్యక్తం చేసింది. వైద్యురాలికి దండం పెట్టింది. ఇద్దరు ఆడ బిడ్డలు, తల్లి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యురాలు కవిత తెలిపారు.