రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థికి ఓటు వేయవద్దని జనవాహిని పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ జనవాహిని పార్టీ ఆధ్వర్యంలో నాన్ బీజేపీ ఫోర్స్ పేరున విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటెయ్యొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు ఎందుకు వేయకూడదో ఏపిసీసీ వైస్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, జనవాహిని అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వివరించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రం విడుదల చేశారు. బీజేపీ చరిత్ర అంతా మత, కుల కల్లోలేనని విమర్శించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు కూడా సొంత అవసరాలకు వాడుకొనే నీచ సంస్కృతి బీజేపీదని ఆరోపించారు.
జస్టిస్ రంజన్ గొగోయ్‌ను ఇష్టానుసారంగా వాడుకొని రాజ్యసభ సభ్యుడిగా చేసిన చరిత్ర బీజేపీదని డీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిని అర్ధరాత్రి నిద్రలేపి.. తెల్లవారు జామున సంతకాలు చేయించి, ఆ పదవికి గౌరవం లేకుండా చేసిందని బీజేపీపై దుమ్మెత్తిపోశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు అమ్మేస్తోందని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు విజ్ఞతతో ఆలోచించి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలని ప్రసాద్ బాబు పిలుపిచ్చారు.
బిజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమై బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలి- సీపీఐ .
బిజెపీ చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకొనేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా అన్ని బిజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమై బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలని ముప్పల్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పిలుపునిచ్చారు. బిజెపీ రాజ్యాంగాన్ని కూకటివేళ్లతో పెకలించి ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని, హిందూ ఉగ్రవాదాన్ని దేశమంతటా తెచ్చే ప్రయత్నం చేస్తోంది. గుజరాత్ మారణకాండకి ప్రేరేపితుడు నరేంద్రమోదీ కాంగ్రేస్, వామపక్షాలతో సహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఆలోచించి బిజెపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలి. భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తోంది.
బిజెపి మ్యానిఫెస్టో లోని వాగ్దానాలు అన్నీ నెరవేర్చాలి- పద్మశ్రీ
రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఏపి ప్రభుత్వం వుంది. రాష్ట్ర ప్రయోజనాలను సిఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసి సాధించాలి సుంకర పద్మశ్రీ, ఏపిసీసీ వైస్ ప్రెసిడెంట్ సూచించారు. 3 శాతం ఓట్లు రాష్ట్రపతి ఎన్నికలో బిజెపి అవసరం ఉండగా … రాష్ట్రపతి అభ్యర్థిని బిజేపినే చూసుకుంటుందని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఎలా చెబుతారు. వెంకయ్య నాయుడు కాకినాడలో బిజెపి మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన వాగ్దానాలు అన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి. ఆడబిడ్డలైన రాజధాని మహిళా రైతులు డిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరగా ఇవ్వని ఆయన ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారు ? బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి వ్యతిరేక ప్రచారం ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. దేశ ప్రజల సంక్షేమం కోసం బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఓడించాలని డిమాండ్ చేశారు .