శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా శ్రీ శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శాకంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. విజయవాడ చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ఈనెల 11వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. శాకంబరి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు శ్రీ మహాలక్ష్మి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ శాకంబరీ ఉత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించడం జరిగిందన్నారు. నేడు చివరి రోజు కావడంతో భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారని వారు వివరించారు. దేశం సస్యశ్యామలంగా ఉండేలా, పంటలు బాగా పండేలా శాకంబరీ దేవి రూపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. కాగా అమ్మవారికి అలంకరించిన కాయగూరలతో కదంబం వండి భక్తులకు ప్రసాదంగా అందజేసారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కాయగూరలతో కన్నుల పండుగగా అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
శాకాంబరీ అలంకరణలో ధర్మవరంలో వాసవీమాత
ఆషాఢ మాసం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీకన్యకాపర మేశ్వరి ఆలయంలో వాసవీమాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక వాసవీ మహిళ మండలి ఆధ్వర్యంలో అమ్మవారిని 1000 కేజీల వివిధ రకాల కాయగూరలు, పండ్లతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి పూజలు చేయిం చారు. ఆమ్మవారిని దర్శించడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.