మహావిష్ణువు ద్వయావతారుడిగా కొలువుదీరిన సింహాచలం క్షేత్రంలో వార్షిక ఉత్సవం ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా ప్రారంభమైంది. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లు ఉత్సవం జరగకపోవడంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ నుంచి తరలివచ్చిన భక్తులతో ఉదయం ఆరు గంటలకే సింహాచలం భక్త జనసంద్రమైంది. మధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి ప్రత్యేక రథం (పూల రథం)లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈవో ఎం.వి.సూర్యకళ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో సింహాచలం నుంచి హనుమంతవాక జంక్షన్ వరకు బీఆర్‌టీఎస్ రోడ్డు కిటకిటలాడింది. మూడు నుంచి నాలుగు లక్షల మంది స్వామి వార్షిక యాత్రలో పాల్గొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టు భక్తులు ప్రదక్షిణ మొదలుపెట్టారు.
సింహగిరి తొలి పావంచా దగ్గర కొబ్బరి కాయ కొట్టి నమో నరసింహా అంటూ నడక ప్రారంభించిన భక్తులు… అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్ల పాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీ పాలెం మీదుగా సీతమ్మధార, పోర్టు స్టేడియం, కప్పరాడ, మురళీనగర్, మాధవధారకు చేరుకుంటారు. అక్కడ నుంచి హైవేపై ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ, గోపాలపట్నం మీదుగా సింహాచలం కొండకు వెళ్తారు. ప్రతీ ఏటా సింహాచలం వద్ద జరిగే గిరి ప్రదక్షిణ భక్తులకు ఎంతో ముఖ్యమైనది. విశాఖలో 32 కిలో మీటర్ల పొడవున వ్యాపించి ఉన్న సింహాచలం కొండ చుట్టూ భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో కాలినడకన ప్రదక్షిణలు చేసే కార్యక్రమమే గిరి ప్రదక్షిణ. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా కాస్త తక్కువగా ఉన్నందున కొన్ని నిబంధనలతో గిరి ప్రదక్షిణకు అధికారులు అనుమతినిచ్చారు. మొత్తం కొండా చుట్టూ అంటే 32 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసి వచ్చే భక్తులు కొండపైన గల సింహాచలం క్షేత్ర ముఖ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తారు .
ఈసారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ మధ్యలో భక్తులు రెస్ట్ తీసుకోవడానికి 29 స్టాళ్లు, తాత్కాలిక వైద్య శిబిరాలు 133, టాయిలెట్స్ 300, పోలీసులు 2016, 108 వాహనాలు 7తో పాటు 30 ఉచిత బస్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు . భక్తుల కోసం లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. అలాగే ఒకవేళ ఎవరైనా భక్తులు ఈ రోజే 32 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని కొండపైకి చేరుకుంటే వారి దర్శనానికి వీలుగా ఆలయాన్ని రాత్రి 9 గంటలవరకూ తెరచి ఉంచుతామని అధికారులు తెలిపారు. కొబ్బరి కాయలు కొట్టేందుకు ఏకంగా 30 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సచివాలయ, జీవీఎంసీ ఉద్యోగులతోపాటు భక్తుల సౌకర్యార్ధం 40కి పైగా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వాలంటీర్లుగా గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొండపై పరిస్థితిని ఆలయ ఈవో సూర్యకళ సహా ఇతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు .
గిరిప్రదక్షిణ సందర్భంగా సింహాచలం రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వైజాగ్ కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు . గోపాలపట్నం నుంచి వచ్చే వాహనాలను పాత గోశాల నుంచి అనుమతించేది లేదని అన్నారు. సింహాచలానికి రెండో వైపు నుంచి వాహనాలకు అడవివరం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందువల్ల జోడుగుళ్ళపాలెం వద్ద భక్తులను సముద్ర స్నానాలకు అనుమతించేది లేదని చెప్పారు. అయినప్పటికీ, లుంబినీ పార్క్, తెన్నేటి పార్క్ వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తుల కోసం మూడు NDRF బృందాలతోపాటు మెరైన్ పోలీస్ సిబ్బందినీ, గజ ఈతగాళ్లను నియమించినట్టు కలెక్టర్ చెప్పారు . గిరి ప్రదక్షిణ సందర్భంగా చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్‌లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో అధికారులు మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
భక్తులతో కిక్కిరిసిన సింహాచలం రైల్వే స్టేషన్
అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులతో సింహాచలం రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు రైళ్లలో తరలివచ్చారు. దీంతో స్టేషన్ రోడ్, బీఆర్‌టీఎస్ రహదారి స్తంభించిపోయింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లుగా గిరి ప్రదక్షిణ జరగకపోవడంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. కాలినడకన వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా గోపాలపట్నం నుంచి సింహాచలం వైపు వెళ్లే ఆటోలు, కార్లు, బస్సులను వేపగుంట మీదుగా తరలించారు. దీంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గోపాలపట్నం కొండవాలు ప్రాంతం మీదుగా ఉన్న బైపాస్‌తో పాటు దిగువ ప్రాంతం రైల్వే స్టేషన్ బైపాస్ రహదారిలో వాహన చోదకులు రాకపోకలు సాగించడంతో వాహనాల రద్దీ కనిపించింది.
భక్తుల విశ్వాసం
సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. సింహగిరి ప్రదక్షిణం.. భూ ప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పుణ్యం లభిస్తుందన్నది కొందరు విశ్వసిస్తారు. సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
