అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుందాం అని అధికారులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కొల్లు అంకబాబు అనే రిటైర్డ్ జర్నలిస్టును ఓ వార్తను వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేశారన్న కారణంగా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో సీఐడీ తాము నోటీసులు ఇచ్చినా అంకబాబు తీసుకోలేదని అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే అంకబాబు పోలీసులు తన ఇంటికి వచ్చినప్పటి నుండి సీఐడీ అఫీసుకు తీసుకెళ్లే వరకూ ప్రతీ దృశ్యాన్ని వీడియోగా చిత్రీకరించారని,తనకు నోటీసులు ఇచ్చారో లేదో అవి చూస్తే తెలిసిపోతుందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తన ఎదుట నోటీసులు ఇవ్వాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ సీఐడీ అలా నోటీసులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ఆ సమయంలో బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి సీఐడీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం మీరు చేసే చట్ట ఉల్లంఘనలు మిమ్మల్ని సైతం బోనులో నుంచో పెడతాయి. మీరు మూల్యం చెల్లించుకోకతప్పదు.(1/5) pic.twitter.com/0pTSbg67Wb
— N Chandrababu Naidu (@ncbn) September 23, 2022
నిందితుడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నాలుగురోజుల్లోగా జర్నలిస్ట్ అరెస్ట్ వ్యవహారంలో జరిగిన పరిణామాలను వివరించాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ అధికారులు ఇటీవలి కాలంలో పలువురిని ఇలా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఆ తరవాత కోర్టు రిమాండ్ తిరస్కరించడంతో వదిలి పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాల కారణంగా సీఐడీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది. ఏపీసీఐడీకి ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ పెద్దలే తెచ్చి పెట్టారని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం విపక్ష నేతల్ని భయపెట్టేందుకు సీఐడీని ఉపయోగించుకుంటున్నారని దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ యువ నేత నారా లోకేష్ స్పందిస్తూ జగన్ గతంలో ఐఏఎస్‌లను జైలుకు పంపారని ఈ సారి ఐపీఎస్‌లను కూడా పంపుతున్నారని లోకేష్ సెటైర్లు వేశారు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు.(1/3) pic.twitter.com/nDekyuyQHK
— Lokesh Nara (@naralokesh) September 24, 2022