విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహిస్తుందో లేదోగాని అవినీతి మాత్రం జామ్మంటూ పోటెత్తుతోంది. అడిగేవారు లేరని ఆయాశాఖల ఉద్యోగులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఎవరో ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలు కాదు.. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ ఏ ఇలా అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గ్రామీణ విద్యుత్ కోపరేటివ్ సొసైటీ, రూరల్ ఎలక్ట్రికల్ కోపరేటివ్ సొసైటీ(రెస్కో)లో అవినీతి రాజ్యం ఏలుతోంది. వాస్తవానికి ఈ సంస్థ కోపరేటివ్ చట్టం ప్రకారం ఏర్పాటైంది. గుర్ల, మేరకముడిదాం..గరివిడి..చీపురు
చైర్మన్ గా ఓ రాజకీయ నాయకుడిని నామినేట్ చేస్తుంది
ఇక ఈ సంస్థలో నిత్యం ఏదోటి అవినీతి ప్రవహించకపోతే కిక్కుండదు అనుకున్నారో ఏమో గానీ ప్రతి రెండేళ్ళకోసారి ఏవోటి అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. రెండేళ్ల కిందట దాదాపు రూ.1.7 కోట్లు సొమ్ము సంస్థ ఖాతాలోకి చేరలేదు. ఆంధ్ర బ్యాంకులోకి జమచేసిన ఆ డబ్బును బ్యాంక్ ఉద్యోగి ఎత్తుకెళ్లిపోయినట్లు గుర్తించారు. దానిమీద సీబీఐ విచారణ కూడా చేసింది. ఆ తరువాత ఆ డబ్బును మళ్ళీ సంస్థ ఖాతాలోకి తిరిగి చేర్చారు..గొడవ సద్దుమణిగిన రెండేళ్లకు తాజాగా ఇంకో అవినీతికి తెరలేపారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ చంద్రశేఖర్ గొంతెత్తి ఆరోపించారు. కొత్తగా కనెక్షన్ కావాలనుకునేవారి నుంచి రో.3100 మాత్రమే ఫీజ్ తీసుకోవాల్సి ఉండగా రూ 6500 తీసుకుంటున్నారని, ఈ విధంగా భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇంకా సంస్థకు చెందిన పాత సామాను అంటే స్తంభాలు..ట్రాన్స్ఫార్మర్లు ఇలా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని, దీనికి లెక్కాపత్రం లేదని అన్నారు. అంతే కాకుండా తాను ఊళ్ళో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం కరెంట్ తీసేస్తున్నారని, ఏమని అడిగితే సమాధానం లేదని, ఎంపీ అయిన తనకే సమాచారం, సమాధానం లేకపోతే సాధారణ జనానికి ఏమి తెలుస్తుందని ఆయన బాధపడిపోయారు. సంస్థ ఉన్నతాధికారులు తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, తమను ఇష్టమైన ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తూ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలోనే ఇలా ఉంటే వేరే ప్రాంతాల్లో ఇంకెలా ఉంటుందో చెప్పలేమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను జిల్లా సమీక్షా సమావేశంలో ప్రస్తావిస్తానని అన్నారు. ప్రభుత్వ రంగంలోని సంస్థమీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహజం కానీ అధికార పార్టీ ఎంపీయే ఇన్ని ఆరోపణలు చేస్తుండడాన్ని బట్టి చూస్తుంటే సంస్థలో ఇంకా ఎన్ని లొసుగులు ఉన్నాయో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విద్యుత్ సంస్థలో అవినీతి ప్రవహిస్తోంది అని ఎంపీ కుండబద్దలు కొట్టారు.దీనిమీద ప్రభుత్వ పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటారో చూడాలి