విజయనగరం : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే అధికారపార్టీ నేతల్లో కొట్లాట మొదలైంది. నియోజకవర్గంలో ఎవరిది పెత్తనం అనేదానిపై కోలాటం మొదలైంది. పదవి వస్తే వానపాము కూడా తాచుపాములా బుసకొడుతుందని మళ్ళొకసారి రుజువైంది. ప్రజారాజ్యం తరఫున 2009లోను వైఎస్సార్సీపీ తరఫున 2014లో గజపతినగరంలో ఓడిపోయి ముచ్చటగా మూడోసారి 2019లో తనది కానీ ఎస్.కోటలో పోటీ చేసి జగన్ ప్రభంజనంలో గెలిచిన కడుబండి శ్రీనివాసరావు ఇప్పుడు అక్కడ అగ్గిరాజేస్తున్నారు. అప్పటివరకూ అక్కడ సమైక్యంగా ఉంటూ వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య పుల్లలు పెడుతూ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నారైగా చెప్పుకునే ఆయన తరచూ అమెరికా వెళ్తూ గుర్తొచ్చినప్పుడల్లా నియోజకవర్గానికి వచ్చి ఉన్న వారం పది రోజాలు చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ అమెరిగా జంప్ అన్నమాట.
ఇన్నాళ్లూ ఒంటరిగా రాజ్యం ఏలిన ఎమ్మెల్యేకు ఇప్పుడు సరికొత్త థ్రెట్ మొదలైంది. ఈమధ్యనే ఎమ్మేల్సీగా ఛాన్స్ దక్కించుకున్న ఇందుకూరి రఘురాజు రూపంలో ఎమ్మెల్యేకు చిక్కులు ఎదురవుతున్నాయి. స్థానికుడు, నిత్యం ఊళ్ళోనే ఉంటూ పదిమందికి అందుబాటులో ఉండే రఘురాజు రాకతో కడుబండికి డిమాండ్ తగ్గింది. ఇంత ప్రయాస పడి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే ఇంతకూ దొరుకుతాడో లేదో..ఊళ్ళో ఉంటాడో అమెరికాలో ఉంటాడో ఎందుకొచ్చిన బాధ అనుకుంటూ జనం, కార్యకర్తలు, అధికారులు సైతం రఘురాజు దగ్గరకు వెళ్తున్నారు. దానికితోడు ఆయనకు నియోజకవరంలోని కులాల ఈక్వేషన్స్, సామాజిక అవసరాలమీద అవగాహన ఉండడంతో వాటిమీద సాధికారికంగా మాట్లాడగలగడం, అధికారులకు సూచనలు చేయడం సులువవుతోంది.
దీంతో ఎమ్మెల్యే లోలోన రగిలిపోతున్నారు. కొత్తవలస, వేపాడ ఎంపిపి పదవులు తన అనుచరులకు ఇప్పించాలని చూసిన ఎమ్మెల్యేకు ఆల్రెడీ అక్కడున్న వైసిపి సీనియర్లు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేను బైపాస్ చేసేసి ఆయన వ్యతిరేకులు, పదవులు ఎగరేసుకుపోవడంతో ఆయనకు అక్కడ తన ఇమేజి, హోల్డ్ ఏమిటో అర్థం అయిపోయింది. వెలమ కార్పోరేషన్ చైర్మన్ లెక్కల నాయుడు బాబు, వేపాడ ఎంపిపి సత్యవంతుడు ఇంకొందరు సీనియర్లు సైతం రఘురాజు వెంటనే ఉంటూ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ చెక్ పెడుతుండడంతో ఆయనకు ఏమీ పలుపోవడం లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే సహాకరించేది లేదని క్యాడర్ క్లియర్ గా చెప్పేస్తున్నారు.. దీంతో ఆయన “వాటే స్వెట్టింగ్.. వాటే సమ్మర్ ” అనుకుంటూ మళ్ళీ అమెరికా వెళ్లిపోక తప్పదని అంటున్నారు.