ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. మరో వారం రోజుల్లోపే ఆత్మకూరు ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో వైసీపీ, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేపడుతున్నాయి. వైసీపీ మంత్రులను రంగంలోకి దించింది. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, మరో ఎమ్మెల్యే ఇన్ చార్జిగా ఉన్నారు. వారు తమ పని మొదలుపెట్టారు. ఇక బీజేపీ ఇప్పటి వరకూ స్థానిక నాయకులు, సోము వీర్రాజు పైనే ఆధారపడింది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ ని రంగంలోకి దింపుతోంది అధిష్టానం. మంత్రి రోజాపై ఇటీవల మాట్లాడుతూ బీజేపీ సినీగ్లామర్ తో వైసీపీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవాలని చూస్తోందని, ఆత్మకూరు ఉపఎన్నికల్లో విజయం వారిదే అనుకుంటే 10 మంది మంత్రులు ఎందుకంటూ విమర్శలు చేశారు. కమలం రెక్కలన్నీ ఉడగొట్టే రోజు దగ్గర్లోనే ఉందని ఆల్రడీ రోజా వార్నింగ్ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు జయప్రదను అంత హడావిడిగా ఆత్మకూరుకి ఎందుకు పిలిపిస్తారు చెప్పండి. ఈ నెల 19న జయప్రద ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం మొదలుపెట్టబోతున్నారు.
బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్స్
ఆత్మకూరు ఉపఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను రప్పిస్తోంది. ఆరుగురితో బీజేపీ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ రెడీ చేసింది. వీరిలో జయప్రద, సునీల్ దియోధర్, పురంధరీశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్రమంత్రి ఎల్.మురుగన్ ఉన్నారు. వీరంతా ఆత్మకూరు ప్రచారంలో పాల్గొంటారు.
బీజేపీ షెడ్యూల్ ఇదీ..
జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి 18,19 లో ప్రచారం నిర్వహిస్తారు. సినీనటి జయప్రద19వ తేదీ ప్రచారం నిర్వహిస్తారు. జాతీయ కార్యదర్శి సత్యకుమార్ 19, 20 తేదీల్లో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ 19వ తేదీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ 18 తేదీ ప్రచారం నిర్వహిస్తారు. కేంద్రమంత్రి ఎల్.మురగన్ 20 న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక వీరిలో స్టార్ అట్రాక్షన్ జయప్రద. ఈ మధ్య తెలుగు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు జయప్రద. మొన్నామధ్య జేపీ నడ్డా పర్యటనలో ఆమె తళుక్కున మెరిశారు. తన పుట్టినిళ్లు ఏపీనే అన్నారు. రాజమండ్రి తన సొంత ప్రాంతమని అభిమానం చూపించారు. ఇప్పుడు ఆమెను ఆత్మకూరుకి తీసుకొస్తున్నారు బీజేపీ నాయకులు.
ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ రంగంలోకి దిగారు. విక్రమ్ రెడ్డికి పోటీగా గతంలో పలు పేర్లు వినిపించినా చివరికి ఎవరూ మొగ్గు చూపకపోవడంతో స్థానికేతరుడైన భరత్ కుమార్ ని రంగంలోకి దింపారు. అభ్యర్థి నేరుగా మండలాల్లో తిరుగుతున్నారు. ముఖ్య నాయకులంతా ఆత్మకూరులో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ ఆశిస్తోంది. బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన శ్రేణులు సైలెంట్ గా ఉన్నా కూడా ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.