ప్రతిష్టాత్మక రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా చావో రేవో తేల్చుకోవాల్సిన టీడీపీ అన్ని ఎత్తులతో సమాయత్తం అవుతుంది.సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి గాంధీ జయంతి నాడు పాదయాత్ర ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర అదే రోజున ప్రారంభించి సుదీర్ఘంగా నిర్వహించారు. ఇందుకు కొనసాగింపుగా అదే రోజున యాత్ర చేపట్టాలని భావించినా ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. ఇందుకోసం ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. చిత్తూరు జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు 450 రోజుల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర సాగనున్నట్లు సమాచారం.
సీఎం జగన్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగా కార్యాచరణపై కసరత్తు చేశారు. అయితే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించకపోవడంతో షెడ్యూల్ సంక్రాంతి తర్వాతకు మార్చినట్లు తెలుస్తోంది. జనవరిలో పాదయాత్రను ప్రారంభించి ఎన్నికల ప్రచారంతో నారా లోకేష్ భావిస్తున్నారు. దీంతో సుదీర్ఘ పాదయాత్రకు నిర్ణయం చేశారు. మొత్తం 450 రోజులపాటుగా చిత్తూరు టు శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం 2023 జనవరిలో ప్రారంభించి 2024 మార్చిలో ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం తన తండ్రి నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలియవస్తుంది.