విజయనగరం : చాలా రోజుల తర్వాత చంద్రబాబు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్న సీబీన్ టీం ఇప్పుడు ప్రజలు ఆయన్ని మళ్ళీ ఆదరించిన వైనం చూసి ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరుకుతారో లేదో అనే పరిస్థితి తలెత్తినప్పుడు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నిర్ణయం తీసుకుని చాలా మంచి చేసిందని క్యాడర్ మొత్తం సంబరపడుతోంది. విశాఖ, అనకాపల్లి, విజయనగరంలో రోడ్ షోలు నిర్వహించారు. అయితే కార్యకర్తల అంచనాలకు మించి ప్రజామోదం లభించింది.
విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న దగ్గర నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్లే వరకు చంద్రబాబు పట్ల ప్రజలు ఎనలేని ప్రేమను కురిపించారు. మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందా అన్నట్లుగా రోడ్లన్నీ ప్రజలు, కార్యకర్తలు అభిమానులతో నిండిపోయాయి. అంతేకాకుండా ఎన్నాళ్లు గ్యాప్ తీసుకున్నా చంద్రబాబు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకుపోయారు. ఆయనకు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా తాను లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి నష్టం కలుగుతుందన్నదానిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ మూడేళ్లలో ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని చేశారా ? అసలు ప్రభుత్వం ఉన్నది ఎందుకని సూటిగా ప్రశ్నించారు. కేవలం పొలిటికల్ టార్గెట్లను కొట్టడం, ప్రతిపక్ష నాయకులను భయపెట్టడం, బెదిరించడం మినహా ఏమైనా చేశారా అన్న చంద్రబాబు ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం ఇచ్చేవారు కరువయ్యారు. విశాఖలో ఎటు చూసినా తాను అధికారంలో ఉన్నపుడు నిర్మించిన, ఏర్పాటు చేసిన సంస్థలే తప్ప ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటైనా రోడ్డు కానీ, ఓ సంస్థను కానీ పరిశ్రమలు కానీ తెచ్చిందా అని అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎవరూ మచ్చుకైనా స్పందించలేకపోయారు. పనిలో పనిగా చంద్రబాబు వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయిరెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ప్రశాంతమైన విశాఖలో విజయసాయిరెడ్డి రౌడీ రాజ్యాన్ని ఏర్పాటు చేశారని, భూ కబ్జాలు, దందాలు చేస్తూ ప్రజలను భీతావహులను చేస్తున్నారని దునుమాడారు. మొత్తానికి ఆయనలో ఒకనాటి విగర్, పవర్ పంచ్ దగ్గలేదని మరోమా రు రుజువు చేసుకున్నారు. ఆ తరువాత నేడు శుక్రవారం విజయనగరం జిల్లాలోని విజయనగరం నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి ప్రాంతాల్లో రోడ్ షో చేశారు. జిల్లా అభివృద్ధిని పూర్తిగా వదిలేశారని, సొంత ఎజెండా అమలు చేయడం తప్ప ప్రజలకు పనికొ చ్చే పని ఒక్కటీ చేయలేదని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్టు, పరిశ్రమలు ఏవీ ముందుకు సాగలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు యాత్రకు కార్యకర్తలు ఆయా మండల పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 2019 ఎన్నికలతో పాటు ఆ తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పూర్తిగా నిస్తేజమైపోయిన పార్టీ క్యాడర్లో చంద్రబాబు పర్యటన ఉత్తేజాన్ని నింపింది. పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలిస్తూ మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అన్న నమ్మకాన్ని క లిగించగలిగారు. పార్టీమీద నమ్మకాన్ని కోల్పోయి కార్యక్రమాలకు పూర్తిగా దూరమైపోయి ఉన్న కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడిపుడే చేతులు కలుపుతూ ఐక్యంగా ముందుకు సాగుతున్నారు.
దాదాపు 74ఏళ్ల వయసులో మళ్లీ చంద్రబాబులో ఈ ఉత్సాహాన్ని చూసిన క్యాడర్ లో సైతం ఆత్మవిశ్వాసం ముప్పిరిగొన్నది. మొత్తానికి చంద్రబాబు పర్యటన విజయవంతం అయినట్లేనని కార్యకర్తలు సంవరపడుతున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ప్రోదిగొన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అవకాశం ఉందని, పార్టీకి మొదటి నుంచీ దన్నుగా ఉన్న క్యాడర్ మళ్ళీ యాక్టివ్ కాగలిగితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వపు జోరును నిలువరించడం పెద్ద కష్టం కాదన్న నమ్మకం చంద్రబాబు పర్యటన ద్వారా స్పష్టమయ్యింది.