ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. విభజన చట్టానికి అనుగుణంగా 2019 జనవరిలో ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి.. కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు.
హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాల్సి ఉందన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని గుర్తు చేశారు.
ఇటీవల లోక్‌సభలో కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని సభలో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని.. హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించిన సంగతి తెలిసిందే. ఇక్కడ భవనం నిర్మించి హైకోర్టును ఏర్పాటు చేశారు.. కానీ జగన్ సర్కార్ మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది. న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది.. హైకోర్టును అక్కడికి తరలించాలని భావించింది. ఆ దిశగా అడుగులు వేసినా న్యాయపరమైన చిక్కులు, కొన్ని పిటిషన్ల కారణంగా ఆగింది. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.. హైకోర్టుతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాజాగా కేంద్రం ఇచ్చిన సమాధానం చూస్తుంటే.. హైకోర్టు తరలింపు కూడా ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే టాక్ కూడా ఉంది. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే కనక.. ఇక హైకోర్టు తరలింపుకు పూర్తిగా బ్రేకులు పడినట్టే..? మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే ఆ ప్రతిపాదన ముందుకు వెళ్తుంది.. లేదంటే ఇప్పుడున్నచోట హైకోర్టు కొనసాగే అవకాశం ఉంటుంది.