మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కానీ ధర ఎంత ఉన్నా కొనడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే నూనె లేనిదే ఏ వంటలు చేయలేము. ఒకవైపు ధరలు మండిపోతుంటే మరోవైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి వస్తున్నాయి. నూనె లేనిదే వంట చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఈ అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు కల్తీ నూనెలు తయారుచేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది. కల్తీకి ఎంత చెక్ పెట్టిన ఏదో ఒక విధంగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఆహార కల్తీ వల్ల మనకు తెలియకుండానే పలు రోగాలు మన దరి చేరుతున్నాయి. ఇలాంటి కల్తీ నూనెల వల్ల , ఎన్నో రోగాలు చుట్టుముట్టి, మనం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది .మన జేబు గుల్ల చేసుకోవలసి వస్తున్నది.
జోరుగా కల్తీ విక్రయాలు
తిరుపతి, చిత్తూరులో కల్తీ విక్రయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లా, వెంకటగిరి కోటలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొంతమంది వ్యాపారులు, గోల్డ్ విన్నర్ ఆయిల్ పేరుతో విచ్చలవిడిగా కల్తీ నూనె విక్రయిస్తున్నారని తెలుస్తుంది. అది కాక తక్కువ ధరకే నూనె అమ్ముతుండడంతో ,అది కల్తీ నూనె అని తెలియని జనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నూనె కల్తీ
“బ్లెండెడ్ వెజిటబుల్ ఆయిల్” పేరుతో రెండు రకాల నూనెలను కలిపి విక్రయిస్తారు. “బ్లెండెడ్ “అనే పదాన్ని చాలా చిన్నగా ముద్రించి అమ్ముతూ ఉంటారు .ఉదాహరణకు వేరుసెనగ నూనె (80 శాతం), పామాయిల్ (20 శాతం) ను కలిపి ఒక కిలో ప్యాకెట్ చేస్తే ఆ ప్యాకెట్ లో ఏ నూనె ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా ప్యాక్ పైన కనిపించేలా ముద్రించాలి. కానీ ఉత్పత్తిదారులు తక్కువ ధర ఉన్న నూనెను ఎక్కువ మోతాదులో కలిపి ఆ వివరాలేవీ కనిపించకుండా వేరుసెనగ బొమ్మలను కవర్ పై పెద్దగా ముద్రిస్తారు దీనివలన వినియోగదారుడు ఆర్థికంగానే కాక, శారీరకంగా కూడా నష్టపోతాడు.
నెయ్యి కల్తీ
నెయ్యిలో ఎక్కువగా వనస్పతిని కలిపి ,అన్ని ప్రముఖ సంస్థల పేర్లతోనూ విఫణి లోకి తీసుకొని వస్తున్నారు సాధారణ ఉష్ణోగ్రతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డకట్టదు. బాగా చల్లని వాతావరణంలో కొద్దిగా గడ్డ కడుతుంది. కానీ, వనస్పతిని కలిపిన నెయ్యి సాధారణ వాతావరణంలోను గడ్డ కడుతుంది. వేడి చేస్తే కానీ కరగదు.
అనారోగ్య సమస్య
కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. జీర్ణకోస సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలను, సాధ్యమైనంత వరకు తినక పోవడమే మంచిది.
కల్తీ పై చర్యలు తీసుకోవాలి : ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్
కల్తీ నూనెల వల్ల తిరుపతి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్ విరుపాక్ష నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఈ కల్తీ ఆహారం వాడకానికి ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలే బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు, ప్రభుత్వము చర్యలు తీసుకొని కల్తీ అరికట్టాలని లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.