ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ నేతలతో భేటీ కోసం కిషన్ రెడ్డితో కలిసి ద్రౌపది ముర్ము అమరావతి వచ్చారు. సీఎం జగన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్లో ముగ్గురు టీడీపీ ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వేదిక మీద కూర్చున్నారు. కిషన్ రెడ్డి చంద్రబాబు ముర్ము అందరూ మాట్లాడారు. గిరిజన మహిళకు మద్దతు ప్రకటించడం అదృష్టమని అచ్చెన్నాయుడు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ సోము వీర్రాజు మాట్లాడారు. వైసీపీ ఏర్పాటు చేసినమద్దతు సమావేశం కన్నా ఎక్కువ మంది దృష్టి తెలుగుదేశం పెట్టిన సమావేశంపైనే ఉంది. చివరి క్షణంలో మద్దతు ప్రకటించడం టీడీపీ సమావేశానికి రావడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది. అంతే కాకుండా అతి స్వల్ప ఓట్లు ఉన్న టీడీపీ విషయంలోనూ అదే సానుకూలత ప్రకటించడం వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.