తక్షణమే అగ్నిపథ్ పథకంను కేంద్రం ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా యువత డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నేడు భారత్ బంద్‌కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని ? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది.
నిరసన కారుల ఆందోళన చర్యతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆపై రైల్వే స్టేషన్‌లోకి చొరబడిన వందల సంఖ్యలో యువకులు.. ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. అక్కడితో ఆగకుండా స్టాల్స్, రైళ్లను తగులబెట్టారు. నిరసన కారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో యువకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తక్షణమే అగ్నిపథ్ పథకంను కేంద్రం ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా యువత డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో (జూన్ 18) భారత్ బంద్‌కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయని తెలుస్తోంది.