అసలు కేశినేని నానికి ఏమైంది? ఎందుకిలా ఫైర్ అవుతున్నారు? చంద్రబాబుకు పుప్ఫగుచ్ఛం ఇవ్వడానికి నిరాకరించిన నాని.. దానిని తోసేయడం వెనక అంత కసి ఉందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చంద్రబాబును కలిసిన వేళ.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కేశినేని నాని చంద్రబాబుకు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టారు. ఎవరో చెప్పిన మాటలను వింటున్నారంటూ మండిపడ్డారు. ఎందుకనో ఆ ట్విట్టర్ వార్ కు విరామం ఇఛ్చారు కేశినేని నాని. ఇప్పుడు మళ్లీ ఈ ఘటన జరగడంతో.. మళ్లీ చర్చ రేగింది.కేశినేని నాని మొదటి నుంచి దూకుడుగానే ఉండటం అలవాటు. పైగా పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం కూడా అలవాటే. పైగా ఆయన ఎంపీగా ఎదురుగాలిలోనూ రెండోసారి గెలవటం.. అదే సమయంలో టీడీపీ అధికారం కోల్పోవడంతో.. ఆయన ధోరణి మరింత ముదిరింది. లెక్క లేకుండా మాట్లాడటం.. తన పని తాను చేసుకుంటూ పోవడం.. లోకల్ గా ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించడం.. కుదరకపోతే మండిపడటం లాంటివి చేసుకుంటూ పోయారు. ఒక దశలో బిజెపిలోకి వెళ్లిపోతారా అనే టాక్ వచ్చింది.
కేశినేని చిన్ని .. నానికి సోదరుడు. వాళ్లిద్దరికి మొదటి నుంచి పడదు. అయినా పార్టీలో కలిసే పని చేశారు. ఈసారి టీడీపీ కేశినేని చిన్నికే ఎంపీ సీటు ఇవ్వాలని ఫిక్స్ అయింది. నాని చెప్పిన మాట వినడు.. అనే యాంగిల్ లోనే ఈ డెసిషన్ అయినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కేశినేని నాని ఆగ్రహానికి కారణమైంది. తనకెంత భిన్నాభిప్రాయం ఉన్నా.. పార్టీతోనే ఉన్నానని.. అయినాగాని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే.. తన అవసరం లేదనేగా అని కేశినేని నాని ఫీలవుతున్నారంట. పైగా ఆయన కుమార్తెను కార్పొరేషన్ ఎన్నికల్లో తీసుకొచ్చినా.. మేయర్ స్థానం దక్కని పరిస్థితి వచ్చింది.కృష్ణాజిల్లాలో గతంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు కేశినేని నానికి కూడా పడలేదు. వీరిద్దరి మధ్య డామినేషన్ వార్ నడిచింది. కాని జిల్లా పార్టీకి తానే హెడ్ గా దేవినేని వ్యవహరించారు. అలాంటి సమయంలోనే తగాదాలు వచ్చినప్పుడు.. తనకు మద్దతు ఇవ్వలేదని చంద్రబాబుపై కేశినేని ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు.విజయవాడలో ఫ్లై ఓవర్లకు గడ్కరీతో మాట్లాడి నిధులు తేవడం.. టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో సత్సంబంధాలు.. టాటాతో కూడా కొన్ని నిధులు విజయవాడ నియోజకవర్గంలో పెట్టించడం వంటికే కేశినేని తన విజయాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అంతకు మించి అయితే ఏమీ లేవు. జనంతో సంబంధాలు సరిగా లేకపోవడమే ఆయకున్న పెద్ద మైనస్. ఇది గమనించే విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ నానికి ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.మరి కేశినేని చిన్ని నాని స్థానాన్ని రీప్లేస్ చేసి.. తెలుగుదేశాన్ని గెలిపించగలరా.. ఎంపీగా నిలబడగలరా అనేదే ఇప్పుడు చర్చ. ఏమైనా ఛేంజ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ ఛేంజ్ మంచి రిజల్ట్ ఇస్తుందా లేదా వేచి చూడాల్సిందే.