శ్రీకాకుళం : ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉద్దానం తీర గ్రామాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి . వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన కడమటి కోదండరావు (72) అనే వృద్ధుడిని ఆదివారం ఎలుగుబంటి దారుణంగా చంపేసింది. ఆ ఘటన మరువక ముందే సోమవారం వజ్రపుకొత్తూరులోని జీడి తోటలో పని చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలకు తెగించి ఎలుగును నిలువరించడంతో వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. వజ్రపుకొత్తూరు గ్రామ సమీపంలోని సంతోషిమాత ఆలయం దగ్గరలోని తామాడ షణ్ముఖరావు అనే వ్యక్తి జీడి తోటలో పశువులశాలను నిర్మించేందుకు మిత్రులు కలిశెట్టి అప్పలస్వామి (ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్), ఉప్పరపల్లి సంతోష్, శిర్ల చలపతితో పాటు ఇద్దరు ఆర్మీ జవాన్‌లు పోతనపల్లి తారకేశ్వరరావు, పోతనపల్లి పురుషోత్తం వెళ్లారు. పశువులశాల పనిలో నిమగ్నమై ఉన్న వీరిపై తోటలో మాటువేసి ఉన్న ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో అప్పలస్వామికి ముఖం, ముక్కు, నోరు భాగంలో, చలపతిరావుకు కన్ను, నోరు, ముఖం భాగంలో, షణ్ముఖరావుకు తలపై, సంతోష్‌కు తల, ముఖంపై, తారకేశవరావుకు వీపు వెనుక భాగమంతా తీవ్రగాయాలయ్యాయి. ఒక్కొక్కరిపై ఎలుగు దాడి చేస్తుండడంతో ఆర్మీ జవాన్ పురుషోత్తం ప్రాణాలకు తెగించి భల్లూకాన్ని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనను చూస్తున్న చుట్టుపక్క రైతులు భయంతో కేకలు వేయడంతో ఎలుగుబంటి జీడి తోటలోకి పరుగులు తీసింది. ఎలుగును నిలువరించే క్రమంలో ఆర్మీ జవాన్ పురుషోత్తం చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.
రెండు రోజుల కిందట..
కిడిసింగి గ్రామానికి చెందిన కడమటి కోదండరావు (72) ఆదివారం ఉదయం 6 గంటల సమ యంలో కిడిసింగి కొండ సమీపంలో తన జీడితోట వద్దకు వెళ్లారు. తర్వాత 6.30 గంటల సమయంలో స్థానిక మాజీ సర్పంచ్ నర్తు దానేష్‌కు జీడితోటలో పెద్ద ఎలుగుబంటి కనిపించింది. ఆయన గ్రామంలోకి వచ్చి జీడితోటలో ఎలుగుబంటి సంచరిస్తోందని, ఎవరూ అటువైపు వెళ్లొద్దని సమాచారం ఇచ్చారు. కాగా, ఉదయం 6 గంటల సమయంలో జీడితోటకు వెళ్లిన కోదండరావు ఇంటికి చేరకపోవడంతో ఆయన కుమారుడు లోకనాథం జీడితోటకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ కోదండరావు గాయాలపాలై విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకుని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి ఆనవాళ్లు బట్టి ఎలుగుబంటి దాడి చేయడంతో కోదండరావు మృతి చెందాడని గుర్తించారు. ఇటీవల అదే మండలం పెద వంక గ్రామానికి చెందిన బత్తిని కామేశ్వరరావు ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే శివసాగర్ బీచ్‌లో ఒడిశా పర్యాటకులపై రెండు ఎలుగుబంట్లు దాడిచేశాయి. వారు ప్రస్తుతం ఒడిశాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంకూలూరు గ్రామానికి చెందిన ఆలయ పూజారిపై ఎలుగుబంటి దాడిచేసి గాయపరిచాయి. ఇలా వరుస ఘటనలతో ఎలుగు బంట్లు బెంబేలెత్తిస్తున్నాయి.
భయపడుతున్న రైతులు
ఉద్దానంలో వరుసగా జరుగుతున్న ఎలుగుబంట్ల దాడులతో రైతులు తోటలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎలుగు దాడిలో ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన కడమట కోదండరావు అనే వ్యక్తి మృతి చెందగా, నర్తు దానయ్యకు చెందిన ఓ ఆవు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అదే భల్లూకం సోమవారం వజ్రపుకొత్తూరులో ఆరుగురిపై దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలుగు ప్రజలపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తుండడంతో ఉద్దానం వాసులు వణికిపోతున్నారు. ఇంతజరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాగా, ఎలుగు దాడి నేపథ్యంలో తోటలకు ఎవరూ వెళ్లరాదని గ్రామాల్లో రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు.
జనారణ్యంలోకి..
తితలీ తుపాను తరువాత ఎలుగుబంట్లు విరవిహారం చేస్తున్నాయి. కొబ్బరి, జీడి చెట్లు లేకపోవడంతో తలదాచుకునే మార్గం లేక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఉద్దానంతో పాటు తీర ప్రాంతాల్లో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా సంచరిస్తున్నాయి. పట్టపగలు సంచరిస్తున్న ఉదంతాలు సైతం ఉన్నాయి. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, తీర ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత తోటలు, పొలాల్లో ఉండేందుకు ప్రజలు భయపడుతున్నారు. రెండేళ్ల కిందట సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి నరమేధాన్ని స్రుష్టించింది. తెల్లవారుజామున కాలక్రత్యాలు తీర్చుకున్న ముగ్గురిపై దాడిచేసి ప్రాణాలు బలిగొంది. చివరకు యువకుల చేతిలో చిక్కిన ఎలుగుబంటి హతమైంది. ప్రస్తుతం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో 100 వరకూ ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భల్లూకాలు మనిషి ప్రాణాలను తీస్తున్నాయి.