ఇటీవల దాకా ప్రపంచాన్ని వణికించి, తీవ్ర ప్రాణ నష్టం కల్గించిన కరోనా వైరస్ ను ప్రజలు మరువనే లేదు. అంతలోనే మంకీ పాక్స్ అనే మరో పాత వైరస్ కొత్తగా విస్తరిస్తున్నదనీ, అది ప్రాణాంతకమనీ వస్తున్న వార్తలు ప్రజలలో ఆందోళన కల్గిస్తున్నాయి. గతంలో మంకీ పాక్స్ కేసులు నమోదయిన 20 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు తాజాగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. సాధారణంగా ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకునే మంకీ పాక్స్ ఇప్పుడు కొత్తగా అనేక దేశాలకు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్, అమెరికా, స్పెయిన్, ఇజ్రాయిల్ తో సహా 12 దేశాలలో సుమారు 90 నిర్ధారిత మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాలకు మంకీ పాక్స్ వ్యాధి విస్తరిస్తున్నదని నివేదికలు వస్తున్న నేపథ్యంలో వ్యాధిని ఎదుర్కొని నివారించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో https://main.mohfw.gov.in/
తొలికేసు కేరళలో
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్.. భారత్‌కూ విస్తరించింది. తొలికేసు కేరళలో నమోదయ్యింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. తొలుత అనుమానిత కేసుగా గుర్తించిన అధికారులు, వైద్యపరీక్షల అనంతరం మంకీపాక్స్‌గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) మార్గదర్శకాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల యూఏఈ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్ తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం అతడి నుంచి నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపినట్లు తెలిపారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో అది మంకీపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. సదరు వ్యక్తి యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్టులను గుర్తించామన్నారు. బాధితుడి తల్లి దండ్రులు, టాక్సీ, ఆటో డ్రైవర్లతోపాటు మరో 11 మంది తోటి ప్రయాణికులను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించామని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
కేరళకు నిపుణుల బృందం
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివిధ రంగాల నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి బృందాన్ని కేరళకు పంపించింది. అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టేందుకు ఈ బృందం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పనిచేస్తుంది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ), దిల్లీలోని డాక్టర్ ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి, కేరళలోని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయాలకు చెందిన నిపుణులతో పాటు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ బృందంలో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఈ బృందం తగు చర్యలకు సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అందించిన సమాచారం ప్రకారం మంకీపాక్స్.. జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్ కారణంగా వచ్చే వ్యాధి. అంత తీవ్రంగా లేనప్పటికీ.. గతంలో కనిపించిన మశూచి వ్యాధి (స్మాల్‌పాక్స్)ని పోలిన లక్షణాలే మంకీపాక్స్‌లోనూ కనిపిస్తాయని డబ్ల్యూహెచ్‌వో గతంలో పేర్కొంది. తగినస్థాయిలో వ్యాక్సినేషన్ అనంతరం స్మాల్‌పాక్స్‌ను 1980లో నిర్మూలించగలిగారు.
మంకీ పాక్స్ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది ?
మంకీ పాక్స్ అనే వైరస్ వైద్య శాస్త్ర పరిభాషలో ‘పాక్స్ విరిడే’ కుటుంబానికి చెందిన ‘ఆర్ధోపాక్స్’ గ్రూపునకు సంబంధించినది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వైరస్‌ను ఆఫ్రికన్ అడవుల్లోని కోతులు, ఎలుకలు, ఉడతలలో కనుగొన్నారు. 1950వ దశాబ్దంలో తొలుతగా కోతులలో ఈ వైరస్ కనుగొన్నందువల్ల దీనికి ”మంకీ పాక్స్” అన్న పేరు వచ్చింది. జంతువుల నుండి మనిషికి వ్యాపించే ఇలాంటి వ్యాధిని జూనోటిక్ డిసీజ్ అంటారు. ఈ వైరస్ సోకిన జంతువులు కరిస్తే కానీ, వాటి రక్తం, శరీర ద్రవాలు తాకితే కానీ మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన ఇతర వ్యక్తులకు ఇది వ్యాపిస్తుంది. మంకీ పాక్స్ సోకిన వ్యక్తి చర్మంపై పొక్కులు తాకడం ద్వారా, వ్యాధికి గురైన వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ అన్ని మార్గాలలో లాగానే స్వలింగ సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. అంతేకానీ ఇది కేవలం స్వలింగ సంపర్కం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందనే అపోహ సరైనది కాదు. ఏ రకమైన లైంగిక సంపర్కమైనా, వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహిత స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలేమిటి ?
మంకీ పాక్స్ వ్యాధి ప్రారంభంలో సాధారణంగా సీజనల్ గా వచ్చే ”ఫ్లూ” వ్యాధి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటుగా ఇతర కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయి. వ్యాధి ప్రారంభంలో గొంతు నొప్పి, తల నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ, ఒళ్లు నొప్పులు, నీరసం , జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. గొంతు దగ్గర మెడలో ఉండే శోషరస (లింఫ్) గ్రంథులు వాపుకు గురవుతాయి. సాధారణంగా జ్వరం వచ్చిన కొద్దిరోజుల తర్వాత చర్మం పైన పొక్కులు ఏర్పడి, పుండ్లుగా మారి, ఆ తర్వాత వాటిపై చెక్కులు కట్టి, చివరగా రాలిపోతాయి. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం 2 నుండి 4 వారాల పాటు కొనసాగి వ్యాధి తగ్గిపోతుంది.
ఎలా నిర్ధారిస్తారు ?
సాధారణంగా, వ్యాధి లక్షణాలున్న రోగి చర్మంపై పొక్కుల నుండి శాంపిల్‌ను సేకరించి ఆర్‌టి-పిసిఆర్ / పిసిఆర్ టెస్టుల ద్వారా నిర్ధారణ చేస్తారు. నోటి లోపల శాంపిల్ తీసి పరీక్షించే పద్ధతిలో ఈ వ్యాధి నిర్ధారణకు ఖచ్చితత్వం తక్కువగా ఉంటుంది. దీనితోపాటు వైరస్ జీన్ సీక్వెన్సింగ్ కూడా చేసినట్లయితే వైరస్ వ్యాప్తి తీరు, మ్యుటేషన్ల ప్రభావం అర్ధమవుతుంది.
వ్యాధికి చికిత్స ఏమిటి ?
మంకీ పాక్స్ వైరస్ ను చంపే నిర్దిష్టమైన మందు లేదు. జ్వరం, నొప్పులు, దగ్గు వంటి వ్యాధి లక్షణాల నుండి ఉపశమనానికై పారాసిటమాల్, సెట్రిజిన్ వంటి మాత్రలు ఇవ్వవచ్చు. చర్మం పైన పొక్కుల వలన ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా కొద్దిపాటి యాంటిబయాటిక్స్ అవసరమైతే వాడతారు. వ్యాధి నయమయ్యే దాకా అవసరమైనంత విశ్రాంతి, తరచుగా ద్రవ పదార్ధాలు తీసుకుంటూ ఉండటం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం చేయాలి. గతంలో మశూచి (స్మాల్ పాక్స్) వ్యాధి చికిత్సలో ఉపయోగించిన టెకోవిరిమాట్ అనే యాంటీవైరల్ మందును యూరోపియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా 2022లో వ్యాపిస్తున్న మంకీ పాక్స్ చికిత్సకు కూడా వాడేందుకు లైసెన్సు జారీ చేసింది. దీనిపై ఇతర దేశాలలో వైద్య నిపుణులు ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి వున్నది.
మంకీ పాక్స్ వైరస్ ప్రాణాంతకమా ?
సాధారణంగా మంకీ పాక్స్ వ్యాధి స్వల్ప లక్షణాలు మాత్రమే వుండి 2 నుండి 4 వారాలలో తగ్గిపోతుంది. కానీ ఆఫ్రికన్ దేశాల్లో గుర్తించబడ్డ కొన్ని కేసుల్లో మరణాల రేటు 10 శాతం వున్నదని వార్తలు వస్తున్నాయి. జంతువుల నుండి మనుషులకు వ్యాపించే ఏ వైరస్ అయినా మ్యుటేషన్లకు గురికావడం సహజం. మ్యుటేషన్ల ఫలితంగా వ్యాప్తి తీరు, వ్యాధి తీవ్రతలో మార్పులు జరుగుతాయి. కానీ ప్రస్తుతం విస్తరిస్తున్న మంకీ పాక్స్ వ్యాప్తి తీరు, వ్యాధి లక్షణాల తీవ్రతలో కలిగే మార్పులు వంటి అంశాలు భవిష్యత్తులో తేటతెల్లమైన తర్వాత కానీ శాస్త్రీయంగా ఖచ్చితమైన నిర్ధారణకు రావడం సాధ్యం కాదు. అశాస్త్రీయ అంచనాలతో, పుకార్లతో భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు.
వ్యాక్సిన్ ఉన్నదా ?
గతంలో 1980 సంవత్సరానికి ముందు మశూచి (స్మాల్ పాక్స్) నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించిన మశూచి వ్యాక్సిన్ వలన ఏర్పడ్డ రోగనిరోధక శక్తి కొంతమేరకు అప్పట్లో మంకీ పాక్స్ ను కూడా నివారించగల్గింది. 2019లో అమెరికన్ వైద్య నియంత్రణ సంస్ధ అయిన ‘యు.ఎస్.ఎఫ్.డి.ఏ’ స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ వ్యాధుల నివారణకు ఆమోదించిన జిన్నెస్ (ఎమ్‌విఎ-బిఎన్) అనే వ్యాక్సిన్ ను ప్రస్తుతం మంకీ పాక్స్ నివారణలో విస్త్రుతంగా సిఫారసు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది.
ప్రభుత్వ స్ధాయిలో నివారణ చర్యలు
అంతర్జాతీయ ప్రయాణీకులలో వ్యాధి లక్షణాలను గుర్తించి ఐసోలేట్ చేసి చికిత్స అందించాలి. శాంపిళ్లను వైరాలజీ ల్యాబ్‌కు పంపి నిర్ధారించాలి. వ్యాప్తి తీరు – వ్యాధి తీవ్రతలో మార్పుల గురించి అధ్యయనాలు నిర్వహించి, వ్యాధి నివారణ గురించి ప్రజలలో పెద్దఎత్తున అవగాహన కల్గించాలి.
వ్యక్తిగతంగా పాటించాల్సిన చర్యలు
ఇతరుల నుండి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలి. అనుమానిత లక్షణాలు కలిగిన పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువుల స్పర్శకు దూరంగా ఉండాలి. దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలున్న వ్యక్తులకు దూరం పాటించాలి. సభలు, జాతరలు, షాపింగ్ మాల్స్ వంటి హైరిస్క్ ప్రాంతాలలో మాస్క్ ధరించాలి. రెగ్యులర్‌గా చేతుల పరిశుభ్రత పాటించాలి. అనుమానిత లక్షణాలు కనబడ్డ వెంటనే తగిన వైద్య సలహా తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు తగ్గేదాకా ఐసోలేషన్‌లో వుండాలి. ముఖ్యంగా వ్యాధి గురించి ఆందోళన పడకుండా అవగాహనతో మెలగాలి.