ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారం మంగళవారంతో ముగియనుంది. అక్కడ టీడీపీ పోటీ చేయనప్పటికీ వైసీపీ నానా హైరానా పడుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా ఒక్కో ఓటరకు రూ. 5 వందల నుంచి రూ. 2వేల వరకు పంపిణీ చేస్తోంది. వైసీపీ డబ్బుల పంపిణీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. గత సంప్రదాయం ప్రకారం టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపలేదు. విక్రమ్ రెడ్డిపై బీజేపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు, స్వాతంత్య్ర అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది పోటీలో ఉన్నారు. లక్ష మెజారిటీ కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకున్నా.. మెజారిటీ సాధించడం అధికార వైసీపీకి కష్టంగా మారింది. దీంతో వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించారు. ఖచ్చితంగా ఓట్లు పడతాయన్న ప్రాంతాల్లో రూ. 5 వందలు, మరికొన్ని చోట్ల వెయ్యి, 15 వందలు పంపిణీ చేస్తున్నారు. బాగా క్లిష్టంగా ఉన్న చోట్ల ఓటుకు రూ. 2వేలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు, వాలంటీర్ల ద్వారా బహిరంగంగా డబ్బుల పంపిణీ చేపడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతల డబ్బుల పంపిణీని అధికారులు పట్టించుకోవడం లేదు.
ఓటుకు యమగిరాకీ
నియోజకవర్గంలో ఓటుకు యమ గిరాకీ ఏర్పడింది. వైసీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి తమ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత లేదని నిరూపించుకోడానికి ఆపసోపాలు పడుతోంది. నియోజకవర్గంలో రెండు లక్షలకు పైబడి ఓటర్లు ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేందుకు ఎక్కువమంది రాక పోలింగ్ శాతం తగ్గే అవకాశాలున్నాయి. దాంతో రెండు లక్షల మందికి ఓటుకు రూ.500 చొప్పున వైసీపీ డబ్బులు పంపిణీ చేసేందుకు సన్నద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. వలంటీర్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడంతో పాటు ఓటర్లకు నగదు పంపిణీలో వారికి భాగస్వాములు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం ఎన్నిక అధికారులకు ఫిర్యాదు చేశారు. గెలుపు కోసం ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
కూలీలతో ప్రచారం ప్రచారానికి వచ్చే కూలీలకు డిమాండ్ పెరిగింది. ఒక్కొక్కచోట అభ్యర్థి వెంట రూ.100 నుంచి రూ.300లు వరకు డబ్బులిచ్చి కూలీలను ఏర్పాటుచేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. పైగా వారికి అల్పాహారం, భోజన వసతి కల్పిస్తున్నారు. ఇకపోతే వైసీపీ అభ్యర్థి నగదు పంపిణీపై దృష్టి పెట్టడమేకాకుండా తన కులం వారి ఓట్లను సమీకరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు కూడా తమ కులం వారి ఓట్లను సమీకరించేయత్నాల్లో ఉన్నారు.
ఆత్మకూరులో అత్యధిక మెజార్టీ – మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఈనెల 23న జరిగే ఆత్మకూరు ఉపఎన్నికలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సీఎం ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. విక్రమ్‌రెడ్డి గెలుపు ఖాయమని, అత్యధిక మెజార్టీ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ గడపకూ చేరాయని, ప్రజలంతా వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. ప్రతి ఓటర్ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసే విధంగా కృషిచేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విక్రమ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కష్టపడి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తామంతా వైయస్ జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో చేస్తుందో చెప్పుకుంటూ పాజిటీవ్ ఎజెండాతో ముందుకెళ్తున్నామని, ఉపఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ మాత్రం నెగిటివ్ ప్రవర్తనతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మంత్రి కాకాణి మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలంతా గమనిస్తున్నారని, బుద్ధి తప్పకచెబుతారని హెచ్చరించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు.
12 అంశాలతో కూడిన మ్యానిఫెస్టో విడుదల చేసిన ఎంపీ జివిఎల్.నరసింహారావు
బిసీలపై ప్రేమ ఉంటే వైసీపీ ఆభ్యర్ధిని ఉపసంహరించుకోవాలని ఎంపీ జివిఎల్.నరసింహారావు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో నిలిపి చిత్తశుద్ధి చాటుకుందన్నారు. ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని.. మూడేళ్ళ పాలనలో రైతులకు అన్యాయం చేసిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించలేదన్నారు. వైసీపీకి చరమగీతం పాడాలన్నారు. బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని జీవీఎల్ వెల్లడించారు.
ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచార గడువు ఈ సాయంత్రానికి ముగియనుంది. ఉప ఎన్నిక ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా పరిశీలించారు. పోలింగ్ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. దొంగ ఓట్లకు వీలు లేకుండా ఓటర్ల జాబితాను ప్రదర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని వెల్లడించారు. 127 సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తామన్నారు.
ఆత్మకూరు ఉపఎన్నికలో మెుబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లు
ఆత్మకూరు ఉపఎన్నికల్లో భాగంగా ఏర్పాటుచేసిన మెుబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. అనుమసముద్రం, దువ్వూరు, గ్రామాల్లో మొబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్‌ను ప్రారంభించారు. కొవిడ్ పరిస్థితుల్లో వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇబ్బందులు పడకుండా మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి పోస్టల్ బ్యాలెట్ విధానంలో వృద్ధులు, వికలాంగులతో ఓట్లు వేయించారు. ఇంటి వద్దకే వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక బృందాలతో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను ఆయన వివరించారు.