వర్షాకాలం మొదలయ్యిందంటే చాలు సీజనల్ వ్యాధులు కూడా మొదలైనట్టే. ఈ వ్యాధులతో పాటు కరోనా భయం కూడా ప్రజల్లో ఉండేసరికి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వీస్తున్న చలిగాలులకు గొంతు నొప్పి, తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి వస్తే చాలు అది కరోనానా అనే అనుమానం వచ్చేస్తోంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఏపీ గవర్నమెంట్ కొన్ని విధానాలను అమల్లోకి తీసుకొస్తోంది. ఇక రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణ కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫారం అనే ఒక వ్యవస్థను వినియోగించుకుంది.. దీని ద్వారా అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునే అవకాశముంది. ఇకపోతే ఈ సీజన్ లో వచ్చే మలేరియా, డెంగీ, చికున్ గునియా, డయేరియా, టైఫాయిడ్ వంటి 33 రకాల వ్యాధుల వివరాలను ఐహెచ్ఐపి (ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫారం) లో వివరాలు నమోదు చేయించి ఎప్పటికప్పుడు వాటి గురించి పర్యవేక్షిస్తోంది.
ఇక ఏపీలో ఉన్న 7305 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, 1956 ప్రభుత్వాసుపత్రులు, 1910 ప్రభుత్వ ల్యాబులను ఐహెచ్ఐపి పోర్టల్ కు అనుసంధానం చేశారు. దీనిలో భాగంగా మొదట ఏఎన్ ఎం స్థాయిలో ప్రభుత్వం ద్రుష్టి పెట్టినా అనుమానిత లక్షణాలున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. తర్వాతి స్థాయిలో ఆసుపత్రిలో, మూడో స్థాయిలో ల్యాబులో నిర్దారణ ఐన రోగుల వివరాలను పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాకాలం స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఈ వివరాలను పోర్టల్ లో భద్రపరిచారు. వీటి ఆధారంగా ఎక్కువగా ఏ ప్రాంతంలో ఐతే అంటూ వ్యాధులు ఎక్కువగా రికార్డు అవుతాయో ఆ ప్రాంతాలను వైద్య శాఖ హాట్ స్పాట్ లుగా గుర్తించి నివారణ చర్యలు చేపడుతోంది. దీంతో ఐహెచ్ఐపిలో గ్రామ సచివాలయాలను కూడా మ్యాపింగ్ చేస్తే అంటువ్యాధుల వ్యాప్తిపై ప్రజలకు మరింత వేగంగా అవగాహన కల్పించి తద్వారా వ్యాధుల రాకుండా సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ అంశాన్ని ఏపీ వైద్య శాఖ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కున్న ప్రభుత్వం సీజనల్ వ్యాధుల విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.