ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ గా విడిపోయి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలానే ఉన్నాయి. కూర్చుని పరిష్కరించుకోవాల్సిన రెండు రాష్ట్రాలు గొడవ పడుతుండగా, పెద్దరికంగా వ్యవహరించాల్సిన కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. అప్పుడప్పుడు రెండు రాష్ట్రాల ప్రతినిధులను కూర్చోబెట్టిన సమస్యలు కొలిక్కిరాలేదు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక భేటీ నిర్వహించనుంది.
విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై భేటీలో చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలూ ప్రధానంగా చర్చకు రానున్నాయి. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది.
కేంద్ర ఆర్థికశాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9శాఖల అధికారులను భేటీకి ఆహ్వానించారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు అజెండాలో చేర్చారు. వీటితో పాటు సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌కు సంబంధించిన రెండు సంస్థలపై, పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరిగే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రస్తావించలేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ అజెండాలో పొందుపరిచింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.