“అమరావతి రాజధాని” తెలంగాణ నుండి విడిపోయిన తరువాత విభాజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ప్రకటించిన తరువాత ఒక గొప్ప నగరం రాబోతుంది అని ఆంధ్రులు కలలు గన్న నగరం. ప్రభుత్వం మారిన తరువాత అమరావతి అనేది ఒక వివాదాంశంగా మారింది.రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన అక్కడి రైతుల నిరసనలతో హోరెత్తుతోంది ఆ ప్రాంతం. దాని మీద విషయాలు వివరిస్తూ నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ “ధర్మాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవని, ఆ త్యాగాలే అమరావతి రైతులు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి సంకల్పం వృథాగా పోదని, ఆ సంకల్పమే ధర్మాన్ని గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేశ్ రచించిన ‘అమరావతి వివాదాలు- వాస్తవాలు’ అనే పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదికపై ఉన్నా అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలన్నది అందరి ఆకాంక్షగా ఉందన్నారు. అయిదు కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి ధీటుగా విశాఖ, కర్నూలు, తిరుపతి కూడా అభివృద్ధి చెందాలన్నదే తెదేపా సిద్ధాంతమని చెప్పారు.
హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల అభివృద్ధికి తాను కృషి చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన అనుభవం చూసే 2014లో ప్రజలు తమ పార్టీకి ఓట్లేసి గెలిపించారన్నారు. అధికార వికేంద్రీకరణ కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వివరించారు.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగాపాల్గొనగా.. కన్నా లక్ష్మీనారాయణ (భాజపా), రామకృష్ణ (సీపీఐ), తులసిరెడ్డి (కాంగ్రెస్) శ్రీనివాస్‌యాదవ్ (జనసేన), పెద్ద ఎత్తున అమరావతి రైతులు పాల్గొన్నారు.