అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కాస్తా ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుకు నిలువుటద్దంగా మారింది. సొంత పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తున్న వారెందరు ? ముఖం చాటేస్తున్న వారెంత మంది అనే దానిపై ‘హైప్యాక్’ ఇచ్చిన నివేదిక అధికార పార్టీలో కలకలం రేపింది. ‘గడప గడపకు సీఎం సమీక్ష సమావేశంలో ఇదే పనితీరు కొనసాగితే ఆరు నెలల్లో తేల్చేస్తామన్నట్టుగా సీఎం సంకేతాలు ఇచ్చారు.
ముందస్తు ఎన్నికలకు సంకేతమన్నట్టుగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కేడర్‌ను అధికార వైసీపీ గడపగడపకు పంపాలని గత నెలలోనే నిర్ణయిం చింది. రోజుకు 50 గడపలకు తగ్గకుండా ఆరు నెలల్లో ఇదంతా చక్కబెట్టాల్సిందిగా ఆదేశించింది. రోజువారీ పని తీరుపై ఓ కన్నేసి ఉంటామని అప్పట్లోనే సంకేతాలు పం పింది. అయితే ప్రజావ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు తటపటాయించారు. కాస్త ధైర్యం చేసి కొందరు ముందుకు సాగితే ఇంకొంత మంది మాత్రం పూర్తిగా వెనుకడుగు వేశారు. ఏదో ఇంటెలిజెన్సో, ఇంకో మార్గానో ప్రభుత్వానికి నివేదిక అందుతుందనుకుంటే ఏకంగా ముఖ్యమంత్రి జగన్ విశ్వసించే ‘హైప్యాక్’ ఎమ్మె ల్యేల పనితీరులోని డొల్లతనాన్ని నివేదిక రూపంలో బయట పెట్టింది. నెల రోజుల క్రితం ఆరంభించిన కార్య క్రమంలో గడప తొక్కిందెవరు..? వెలుపలే ఉండి పోయిం దెవరనే దానిపై స్పష్టమైన నివేదిక ఇచ్చింది.
వాస్తవానికి గత నెల 11వ తేదీన గడపగడపకు కార్యక్ర మాన్ని ప్రారంభించగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో సగం మంది ఎమ్మె ల్యేలు పెద్దగా ఈ కార్యక్రమంపై ఆసక్తే ప్రదర్శిం చలేదు. హైప్యాక్ పేర్కొన్నదాని ప్రకారం.. కొద్ది రోజులపాటు గడపగడపకు వెళ్లిన వారిలో జిల్లాలో సగం మంది ఎమ్మెల్యేలు లేనేలేరు. పది రోజుల పాటు వరుసగా తిరి గినవారు, పది రోజులు లోబడి తిరిగిన వారెంతమంది అనే దానిపై నివేదించినప్పుడు పోలవరం, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు, ఆచంట వంటి నియోజకవర్గాలు ముందు వరుసలో ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వెనుకడుగు వేసినట్టు నివేదించినట్టు చెబుతున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తణుకు నియోజకవర్గంలో దాదాపు 12 రోజులలపాటు మంత్రి, మరో మూడు రోజుల పాటు ఆయన కుమారుడు పాలు పంచుకోగా, మరో మంత్రి కొట్టు సత్యనారాయణ వీక్‌ఎండ్ రోజుల్లో మాత్రం సంపూర్ణంగా గడపగడపకూ తిరిగారు.
అసలేమైనట్టు..?
ఆది నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఏమైపోయారు.?ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు.? ముఖ్య నేతలకూ అందుబాటులో లేకుండా ఎందుకు మౌనం దాల్చారు? అనే ప్రశ్నలు తాజాగా తలెత్తాయి. వాస్తవానికి గడపగడపకు కార్యక్రమం ఆరంభించక ముందే ఆయన సొంత పనిమీద అమెరికా వెళ్లినట్టు దీనికి సీఎం జగన్ అనుమతి తీసుకున్నట్టు భారీగా ప్రచారం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి పోయిన తరువాతే ఆళ్ల నాని వైఖరిలో మార్పు వచ్చినట్టు చెబుతున్నారు.
తాజాగా జరిగిన వైసీపీ వర్క్‌షాపులో అసలు గడప గడపకు తొక్కని ముఖ్య నియోజకవర్గాల్లో ఏలూరు కూడా ఒకటని ప్రకటించడం అందరినీ ఆ వైపు చూ సేలా చేసింది. ఆయన క్యాంపు కార్యాలయంలో పని చేసే ఉద్యోగులతో పాటు మిగతా వారు కూడా ఇప్పటివరకు దీనిపై పెదవి విప్పకపోవడంతో ఆళ్ల నాని వైఖరిపై రాజకీయ భిన్న కథనాలకు దారి తీసింది. ఆళ్ల నాని తనకు ఇష్టమైన వైజాగ్‌లోనే గడుపుతున్నారని కొందరు చెబుతున్నా ఏదీ ధ్రువీకరించలేని పరిస్థితి మిగతా వారిలో ఉంది. ఇంతకీ ఆళ్ల నాని మౌనం దాల్చడం వెనుక, కార్య క్రమాలకు దూరంగా ఉండడం వెనుక బలమైన కార ణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై ఇప్పుడిప్పుడే చర్చకు దారి తీస్తోంది.