ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రధాన ప్రతిపక్షాల మీద బీజేపీ యుద్ధం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం బల్క్‌డ్రగ్ ప్రాజెక్టు కేటాయించడంపై టీడీపీ వ్యతిరేకత వ్యక్తం చేయడాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే చిత్తూరు జిల్లాలో రైతు వడ్డే రత్నం మృతి ప్రభుత్వం చేసిన హత్యన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారపక్షం నాయకులు, ప్రభుత్వ అధికారుల కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన విపరీతంగా జరుగుతోందని, చిత్తూరు జిల్లాలోని పెనమూరు రైతు వడ్డే రత్నం మరణమే సాక్ష్యమన్నారు. తన సమస్య పరిష్కారానికి తాహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి ఆ కార్యాలయంలోనే చనిపోవడం హృదయవిదారకంగా భావిస్తున్నామని,బీజేపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు.అధికారులు సిగ్గుతో తల దించుకోవాల్సిన సంఘనట ఇది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రిగాని, సంబంధిత మంత్రిగాని, ఉన్నతాధికారులు కాని స్పందించకపోవడం ఇంకా ఘోరం. రైతు వడ్డే రత్నంది ప్రభుత్వ హత్య. రత్నం మరణాన్ని హత్యకేసుగా నమోదుచేసి ఏకసభ్య కమిషన్‌తో విచారించి అయనను వేధించిన వారిపై కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే దేశంలో ప్రతిష్టాత్మకమైన 3 బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటుచేయనుంటే అందులో దక్షిణాదిరాష్ట్రాల నుంచి ఎపీకి మాత్రమే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఉచితంగా ఇస్తుంది. పదివేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఏడాదికి రూ.50 వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాని ఈ ప్రాజెక్టు ఏర్పాటును టీడీపీ వ్యతిరేకిస్తోందన్నారు. వైఎస్ఆర్‌సీపీ నిర్ల్యక్షం వహిస్తోందన్నారు. ఈ రెండు పార్టీల కారణంగా లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.