విద్యుత్ నియంత్రణ మండలి 2021 -22 మూడో త్రైమాసికానికి (2021 అక్టోబర్ నుండి డిసెంబర్) సంబంధించిన విద్యుత్ ట్రూ అప్ చార్జీల ప్రతిపాదనపై జరిగిన ఆన్లైన్ బహిరంగ విచారణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ బిల్లులతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, పైపెచ్చు అదనపు లోడ్ సాకుతో వేల రూపాయలు అదనంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 200 యూనిట్ల లోపు వినియోగించే వారికి ఇచ్చే రాయితీలో కోత పెట్టారు. నోటిఫై చేసిన దళిత కాలనీల్లో నివసించే వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని మెలిక పెట్టి ఎస్సీ, ఎస్టీ వర్గాల పై చార్జీల భారం మోపుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, వంట గ్యాస్ తదితర ధరల భారంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో ఉపశమనం కలిగించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక త్రైమాసికానికి 598 కోట్ల 35 లక్షల భారం మోపటానికి పంపిణీ సంస్థల ద్వారా ప్రతిపాదన పెట్టడం శోచనీయం. ఇప్పటికే విద్యుత్ ఇతర భారాలతో ప్రజల కుంగిపోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, చిన్న పరిశ్రమలు మూత పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఒక్కొక్క యూనిట్ కి 33 పైసల నుండి 45 పైసల వరకు ట్రూ అప్ భారం మోపడం గర్హనీయం. మూడు నెలలకే ఆరు వందల కోట్లు అయితే సంవత్సరానికి 2400 కోట్ల రూపాయల వరకూ అదనపు భారం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడ, ఏ వస్తువుకు, సేవకు వినియోగించుకున్న సంవత్సరాల తర్వాత అదనపు రుసుము వసూలు చేసే పద్ధతి లేదు .కానీ విద్యుత్ రంగంలో ట్రూ అప్ పేరుతో భారం మోపటం అమానుషం. ఈ విధానాన్ని రద్దు చేయాలి. ప్రస్తుతం ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. సబ్సిడీ ఇవ్వాలి. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీల దోపిడీకి ప్రభుత్వాలు గతంలోనూ, నేడు అడ్డగోలుగా ఒప్పందాలు చేశారు. బడా కంపెనీలు విపరీతమైన లాభాలు ఆర్జించాయి, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లోకి నెట్టేశారు. విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతున్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం
గతంలో చేసుకున్న పీపీఏల ప్రకారం బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశాల ప్రకారం అదనంగా రెండు సంవత్సరాలకు 6,200 కోట్ల రూపాయలు భారం పడనుంది . దీనిపై పంపిణీ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రజలపై భారం లేకుండా చేయాలి. కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఇతర ఇంధనాలను కార్పొరేట్ల చేతిలో పెట్టడంతో విపరీతంగా విద్యుత్చార్జీలు పెరుగుతున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం షరతులకు లొంగీ పోయి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. మీటర్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇందులోనూ అవినీతి చోటు
చేసుకుంటున్నది . ఈ భారం వినియోగదారులపై మోపుతుంది.
శ్రీలంకలో పవన విద్యుత్తు ఒప్పందాన్ని అదానీ కంపెనీకి కట్టబెట్టడానికి కేంద్రం, మోడీ శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని విమర్శలు శ్రీలంక అధికారులు చేశారు. అదే తరహాలో కేంద్రం ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాలపాటు అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన భారాన్ని వేస్తున్నారు. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి విద్యుత్ రంగాన్ని, ప్రజలను దెబ్బతీస్తున్నారు . విద్యుత్ పంపిణీ సంస్థలలో అవినీతి, దుబారా పెచ్చరిల్లాయి. ఎస్సీ ఎస్టీ వర్గాల రాయితీ పూర్తిస్థాయిలో అందించాలి.అదనపు లోడ్ పేరుతో డిపాజిట్ల ఆపాలి .చార్జీల భారం మోపితే ప్రతిఘటన తప్పదు,
మరో ఉద్యమం తప్పదు
విద్యుత్ నియంత్రణ మండలి 8 సంవత్సరాలు గడిచినా హైదరాబాద్ నుండే పని చేయడం బాధాకరం. కరోనా పోయినా ఆన్లైన్ విచారణలతో తూతూమంత్రంగా చేయటం సమంజసం కాదు.ఆంధ్రప్రదేశ్ నుండే నియంత్రణ మండలి పని చేయాలి. బహిరంగ విచారణ పునరుద్దరించాలి, ప్రజల గోడు వినాలి అని డిమాండ్ చేశారు.